రోడ్డు దాటుతూ తిరిగిరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డు దాటుతూ తిరిగిరాని లోకాలకు..

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి దాటుతున్న పంచాయతీ కార్మికుడిని ఓ గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు కారు బానెట్‌పై పడడంతో దాదాపు 300 మీటర్ల దూరం వెళ్లాక బ్రేక్‌ వేయడంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కర్రె ఎల్లయ్య (56) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆర్‌వీఎస్‌ కాంప్లెక్స్‌ నుంచి జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఎల్లయ్యను ఢీకొంది. ఈ ఘటనలో ఎల్లయ్య కారు బానెట్‌పై పడగా డ్రైవర్‌ ఆపకుండా 300 మీటర్ల దూరం తీసుకెళ్లి బ్రేక్‌ వేయడంతో రోడ్డుపై కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ కారును ఆపకుండా వెళ్లాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య నాగమణి, కుమారుడు రాజు, కుమార్తె హేమలత ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్‌ తెలిపారు.

బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

రేగొండ: బైక్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట క్రాస్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్‌కు చెందిన ఒన్నాల మొగిలి (59), సరోజన దంపతులు బైక్‌పై తిరుమలగిరిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో దమ్మన్నపేట క్రాస్‌ వద్ద కారు వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా మొగిలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరోజనను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కొడుకు రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు..

రఘునాథపల్లి: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన ముక్కెర రాములు,రాజమ్మ దంపతుల కుమారుడు రాజు అలియాస్‌ నితిన్‌ (22) తన ద్విచక్రవాహనంపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యాడు. రాత్రి కోమటిగూడెం మీదుగా తిరిగి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఓ రైతు పైపులైన్‌ కోసం తవ్వి పూడ్చగా.. ఎత్తుగా ఉండడతో బైక్‌ అదుపు తప్పి కిందపడింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న రాజు అలియాస్‌ నితిన్‌కు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

కారు ఢీకొని పంచాయతీ కార్మికుడు మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement