కాజీపేట క్రూ డిపోకు ట్రైన్‌ మేనేజర్లు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట క్రూ డిపోకు ట్రైన్‌ మేనేజర్లు

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు

కాజీపేట రూరల్‌ : కాజీపేట రైల్వే లోకోపైలెట్ల క్రూ డిపో కార్యాలయానికి 8 మంది ట్రైన్‌ మేనేజర్లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు జారీ అయినట్లు రైల్వే నాయకులు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి కాజీపేట క్రూ డిపోకు సిబ్బంది బదిలీపై వచ్చారని, ఈ ఏడాది 8 మంది ట్రైన్‌ మేనేజర్లును కాజీపేటకు బదిలీ చేస్తూ సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే సంఘ్‌ లోకోరన్నింగ్‌ బ్రాంచ్‌ సెక్రటరీ పాక రాజ్‌కుమార్‌ తెలిపారు. విజయవాడ వద్ద గల గాలా క్రూ డిపో కార్యాలయం నుంచి 8 మంది ట్రైన్‌ మేనేజర్లు రెక్వెస్ట్‌ బదిలీపై త్వరలో కాజీపేటకు రానున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ జనరల్‌ సెక్రటరీ మర్రి రాఘవయ్య కృషితో ట్రైన్‌ మేనేజర్ల బదిలీలు జరుగుతున్నాయని రాజ్‌కుమార్‌ తెలిపారు.

అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం

కాశిబుగ్గలోని ఓ హోటల్‌లో ఘటన

రూ.10వేల జరిమానా విధించిన అధికారులు

కాశిబుగ్గ: వరంగల్‌ కాశిబుగ్గలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో అల్పాహారంలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన వినియోదారుడు షాక్‌కు గురయ్యాడు. గురువారం కాశిబుగ్గలోని ఓ టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన ఆ వ్యక్తి వడ తింటున్న సమయంలో బల్లి కళేబరం ముక్కలుగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే టిఫిన్‌ సెంటర్‌ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి బ్రేక్‌ఫాస్ట్‌కు సంబంధించిన ఆహార పదార్థాలు, పిండిని పరిశీలించారు. అనంతరం ఫుడ్‌ సేఫ్టీ అధికారి మౌనిక హోటల్‌ నిర్వాహకుడికి రూ.10వేల జరిమానా విధించడంతో పాటు వారం రోజులు టిఫిన్‌ సెంటర్‌ మూసివేయాలని ఆదేశించారు.

ట్రాక్టర్‌ బోల్తాపడి

డ్రైవర్‌ మృతి

శంకరంతండాలో ఘటన

చెన్నారావుపేట: మొరం తరలిస్తుండగా ట్రాక్టర్‌ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరంతండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య రాజు (24) ట్రాక్టర్‌లో మొరం తరలిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని శ్మశానవాటిక వద్ద ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement