మామునూరు: పాత ఇంటి గోడ కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు కూలి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సూర యాకయ్య (45) కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అదేకాలనీకి చెందిన కుంచం పురుషోత్తంతో కలిసి యాకయ్య కూలి పనులకు వెళ్తున్నాడు. రోజు వారీగానే మామునూరు గ్రామంలో ఎర్ర సంతోష పాత ఇంటిని కూల్చివేసేందుకు గురువారం ఉదయం యాకయ్య, పురుషోత్తం కూలికి వెళ్లారు. కూల్చివేసే క్రమంలో ఆకస్మికంగా కూలీలపై గోడ పడిపోవడంతో సూర యాకయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మామునూరు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాకయ్య మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
మామునూరులో ఘటన


