● పాడైన రూ.1.06 లక్షల విలువైన సరుకులు స్వాధీనం
రామన్నపేట/ఖిలావరంగల్ : పాడైపోయిన వంటనూనెలు, హానికర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న వ్యాపారి ఇంటిపై టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. ఇందులో సుమారు రూ.1,06,780 విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం.. టాస్క్‌ఫోర్స్ బృందం.. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చింతల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న మరియా ట్రేడర్స్‌పై తనిఖీలు నిర్వహించారు. ఇందులో పరిశ్రమలో వినియోగానికి అనర్హమైన వంటనూనెలు, ఫుడ్ కలర్లు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అనంతరం పరిశ్రమ యజమానిని తరమం ఆశీర్వాదంగా గుర్తించి 361 కిలోల ఖారా, 114 కిలోల భోంది, 80 కిలోల చేగోడి, 30 కిలోల కారం, 8 బాక్సుల ఫుడ్ కలర్‌తోపాటు సుమారు 60 కిలోల పాడైపోయిన వంటనూనెలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.1,06,780 ఉంటుందని అధికారుల అంచనా. షాపు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మంగీలాల్, ఎస్సై చందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.


