● ఎస్పీ శబరీష్
కేసముద్రం: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ పెట్టాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం కేసముద్రం జెడ్పీహైస్కూల్‌లో మన ఊరు–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై 9, 10, ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్‌ను నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, హెచ్‌ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.


