శిథిల భవనం! | - | Sakshi
Sakshi News home page

శిథిల భవనం!

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్నాయి. స్లాబ్‌ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన భవనాల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

వందేళ్లు దాటిన భవనాలు..

జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం 1914లో నిర్మించిన భవనంలో నేటికీ కొనసాగుతోంది. అధికారులు, సిబ్బంది భయంతో ఉద్యోగం చేస్తున్నారు. నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ కార్యాలయం 1926లో నిర్మాణం చేసి భవనంలో కొనసాగుతోంది. ఆ భవనంలో కొన్ని గదులు కూలిపోయాయి. మిగిలిన గదులను మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. ఈనెల 22న ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ ఆ కార్యాలయాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నిజాంకాలం నాటి భవనంలో..

జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలో కొనసాగుతోంది. ఆ భవనంలో కూడా కొన్ని గదులు కూలిపోయాయి. మిగిలిన గదులను మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. వర్షం వస్తే చాలా వరకు కురుస్తుంది. స్లాబ్‌ పెచ్చులు నేటికీ ఊడి కింద పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆఫీసర్‌ క్లబ్‌ భవనం కూడా కూలిపోయే దశలో ఉంది. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు.

కూలిపోయే దశలో..

జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆవరణ అంతా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పాములు సంచరిస్తున్నాయి. పందులకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ క్వార్టర్స్‌ సగం కూలిపోగా.. మిగిలినవి కూడా కూలిపోయే దశలో ఉన్నా యి. ఖాళీగా ఉన్నవాటిని కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాల కూడా శిథిలావస్థలో ఉంది.

నోటీసులు..

వర్షాకాలం రాగానే కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తున్నారు. కానీ, శిథిల భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం..

పలు కార్యాలయాల భవనాల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిపాదనల ఫైళ్లలో కదలిక లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృథా అవుతున్నాయే తప్ప సమస్య తీరడం లేదు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఇటీవల బాలరక్షా భవన్‌ అద్దె భవనంలో ఉండగా సఖి కేంద్రంలోకి మార్చారు. డీటీఓ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు మార్చారు. దీంతో అద్దెకు అవకాశం లేకపోవడంతో శిథిల భవనాల్లో ఉండాల్సి వస్తోంది.

నిజాంకాలం నాటి భవనాల్లో పలు కార్యాలయాలు

శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఇబ్బందులు

తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృథా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement