బ్యాంకు స్ట్రీట్‌లోని డ్రెయినేజీలో నిలిచిన మురుగునీరు, సాయినగర్‌లో నూతనంగా నిర్మించిన కాల్వలో నిలిచిన మురుగు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో డ్రెయినేజీలు, సైడు కాల్వల్లో మురుగు, వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్యలోపం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, అధికారులు డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పలు వార్డుల్లో..
మున్సిపాలిటీ పరిధిలో 15వార్డులు ఉన్నాయి. కాగా, కొంతకాలంగా డ్రెయినేజీలు, సైడు కాల్వ లను శుభ్రపరచకపోవడంతో మురుగు, వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. గాంధీ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్, బ్యాంకు స్ట్రీట్ నుంచి పాతడోర్నకల్ వరకు ప్రధాన రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలను నెలల తరబడి శుభ్రపర్చడం లేదు. దీంతో మురుగు, వ్యర్థాలతో డ్రెయినేజీ నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే దోమల బెడద పెరగడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో డ్రెయినేజీలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడంతో శుభ్రం చేసే అవకాశాలు లేక వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులతో డ్రెయినేజీలు మూసుకుపోయాయి.
పెరిగిన సైడు కాల్వలు..
ఇటీవల ఒక్కో వార్డుకు కోటి రూపాయల నిధులు మంజూరు కావడంతో 15 వార్డుల్లో సైడు కాల్వలను నిర్మించారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో సైడు కాల్వల పొడవు పెరిగింది. సైడు కాల్వలు నిర్మించి నెలలు గడుస్తున్నా .. నేటి వరకు శుభ్రపరచకపోవడంతో మట్టి, వ్యర్థాలు, మురుగుతో మూసుకుపోతున్నాయి.
డ్రెయినేజీల్లో పేరుకుపోయిన మురుగు
దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు
డోర్నకల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరతతో పారిశుద్ధ్య సమస్యలు
సిబ్బంది కొరత..
మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో డ్రెయినేజీలు, కాలువలు శుభ్రపరిచేందుకు ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో అరకొరగా కాల్వలను శుభ్రపరుస్తున్నారు. ప్రస్తుతం అమృత్ పైపులైన్లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల్లో తరచూ పైపులు పగులుతుండగా.. సిబ్బందిని పైపులైన్ల మరమ్మతులతో పాటు ఇతర పనులకు వినియోగిస్తున్నారు. దీంతో నెలల తరబడి కాల్వలను శుభ్రపరచకపోవడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై వర్షాలు పడుతుండడంతో అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయనిఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు స్పందించి డ్రెయినేజీలు, సైడు కాల్వలను శుభ్రపరిచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


