నిర్లక్ష్యం ఎవరిది? | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఎవరిది?

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

పర్వతగిరి : వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 7: 30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఓ బాలుడు అక్కడికక్కడే, ఇద్దరు ఎంజీఎంలో మృతి చెందారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఎల్లగౌడ్‌, అహ్మద్‌ చికిత్స పొందుతూ రాత్రి సుమారు 11 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అదే రోజు అర్ధరాత్రి ముగ్గురి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరుసటి రోజు ఉదయం సుమారు 10: 30 గంటలకు పోస్టుమార్టం నిర్వహించాల్సిన వైద్యులు సాయంత్రం 4 గంటల సమయంలో నిర్వహించి 5 గంటలకు మృతదేహాలను అప్పగించారు. దీనిపై బంధువులు, స్థానికులు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనపై ‘దయనీయస్థితిలో మృతదేహాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఎంజీఎం అధికారులు వివరణ ఇచ్చారు. ముగ్గురి మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియలో వైద్యుల ఆస్యమేమీకాలేదని, పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించారన్నారు. అంతేకాకుండా డబ్బులు డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఘటనలో నిర్లక్ష్యం పోలీసులదా..? వైద్యులదా? అనే అంశంపై పలువురి అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై సోమారం గ్రామ సర్పంచ్‌ ఏర్పుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోస్టుమార్టం నిర్వహించే కిందిస్థాయి సిబ్బంది ఒక మృతదేహానికి రూ.5,500 ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారన్నారు. డబ్బులు డిమాండ్‌ చేసిన విషయంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో పోస్టుమార్టం ప్రక్రియ గంట ఆలస్యం చేశారని తెలిపారు. ఈ విషయాలపై ఎంజీఎం అధికారుల వివరణలో వాస్తవం లేదన్నారు.

పోస్టుమార్టం ఆలస్యంపై ఎంజీఎం అధికారుల వివరణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement