పాలకుర్తిటౌన్:(దేవరుప్పుల) : అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సృజన్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన చింత సుదర్శన్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి దొంగ నోట్లు, ప్రింటర్, కారు, రూ. 8500 నగ దు, నాలుగు సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం పాలకుర్తి ఇన్‌చార్జ్ సీఐ, వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో స్థానిక ఎస్సై సృజన్‌కుమార్ ఆ నలుగురిని బుధవారం రిమాండ్ నిమిత్తం జనగామ జైలుకు తరలించారు. కాగా, దొంగ నోట్ల గుట్టు రట్టులో ఎస్సైతోపాటు సిబ్బంది యాకూబ్, యాకేశ్, దామోదర్, అశోక్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు.
ప్రింటర్, కారు, ఇతర సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య


