నయీంనగర్ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయాధారిత వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27 కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన 100 పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు. శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో ‘లక్ష్యం కోసం లక్ష సైన్యం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ రానున్న నల్లగొండ– వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ తరఫున కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. టీఆర్‌ఎల్‌డీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంప్రసాద్, నాయకులు రాజ్‌కుమార్ రెడ్డి, బుల్లెట్ వెంకన్న, కుందె గిరి, కోటి, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్


