హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెల 29న వరంగల్ పర్యటనకు వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వరంగల్ రానున్నారు. ఈ దిశగా పర్యటన విజయవంతానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సభ నిర్వహణకు గాను బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతం రావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు స్థల పరిశీలన చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని కుడా (హయగ్రీవచారి) మైదానం, వరంగల్‌లోని అజాంజాహి మిల్లు గ్రౌండ్, మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ను పరిశీలించారు. చివరకు హనుమకొండ బాలసముద్రంలోని కుడా మైదానంలో సభ నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. అనంతరం హనుమకొండ హంటర్ రోడ్‌లోని సత్యం కన్వెన్షన్‌లో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్.గౌతం రావు మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంటా రవికుమార్, ఆయా జిల్లాల అధ్యక్షుడు బలరాం నాయక్, శశిధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.
స్థల పరిశీలన చేసిన నాయకులు


