అర్ధరాత్రి ఇసుక దందా! | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఇసుక దందా!

Jun 24 2026 1:11 AM | Updated on Jun 24 2026 1:11 AM

ఆకేరు, మున్నేరు వాగుల నుంచి విచ్చలవిడిగా అక్రమ రవాణా

చిన్నగూడూరు మండలంలో ఆకేరు వాగు నుంచి

ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు(ఫైల్‌)

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా చేసేందుకు కూపన్లు ఇస్తున్నారు. అయితే కూపన్లు ఇచ్చేందుకు గృహనిర్మాణ శాఖ, గ్రామ కార్యదర్శి ద్వారా ధ్రువీకరించిన పత్రాలు చూపించాలి. అప్పుడు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కూపన్లు పంపిణీ చేస్తారు. ఇదే అదునుగా ఒక్క కూపన్‌ చూపించి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ లబ్ధిదారులకు కాకుండా.. ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మకాలు చేసి అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రచారం.

అర్ధరాత్రి వేళ..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వేచ్ఛగా పగలు ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ శబరీష్‌ ఆదేశించారు. కూపన్ల పంపిణీపై రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిఘా పెట్టాలని పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం ఇందిరమ్మ మొదటి విడత నిర్మాణాలు సగానికి మించి పూర్తయ్యాయి. దీంతో పలు మండలాల్లో ఇసుక కూపన్ల పంపిణీ నిలిపివేశారు. అయితే ఉదయం పూట కూపన్ల పేరుతో రవాణా చేయడంతో పాటు.. వారం రోజులుగా జిల్లాలో రాత్రిపూట ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు ప్రచారం. రాత్రి 10నుంచి తెల్లవారుజాము 4గంటల వరకు నిరాటంకంగా రవాణా చేస్తున్నారు. నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు మండలాల్లో దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు.

భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి

నాకు ఆకేరు వాగు పక్కనే మూడెకరాల పొలం ఉంది. ప్రతీ ఏడాది వానాకాలం, యాసంగి పంటలు సాగు చేస్తే పుష్కలంగా వరి పంట పండేది. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేద్దామన్న నీళ్లు నిల్వ లేని పరిస్థితి. ఇదే అదునుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తుండడంతో భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. చెక్‌ డ్యామ్‌ కుడి ఆనకట్టకు మరమ్మతులు చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.

– భర్తాపురం కొమురెల్లి, రైతు, ఉగ్గంపల్లి

రాత్రిపూట ఇసుక రవాణా నిలిపివేయాలి

ఆకేరు వాగు నుంచి రాత్రిపూట ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో ముంగిమడుగు, రామన్నగూడెం, నర్సింహులపేట ప్రజలకు నిద్రలేకుండా పోతుంది. మితిమీ రిన వేగంతో ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయం వేస్తుంది. అక్రమంగా రవాణా జరుగుతున్న ఇసుకను అధికా రులు అరికట్టాలి. రాత్రి వేళల్లో మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమ రవాణాను నియంత్రించి ఇందిరమ్మ ఇళ్లకు పేద లబ్ధిదారులకు తక్కువ ధరలకు పంపిణీ జరిగేలా చూడాలి.

– కొంపెల్లి నరేష్‌, నర్సింహులపేట

అధికారుల మౌనం వెనుక..

అర్ధరాత్రి ఆకేరు, మున్నేరు వాగుల నుంచి ఇసుకను తరలిస్తూ స్థానికంగా డంప్‌లు పోయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల సమీపంలో పోయడం, గోదావరి ఇసుకలో కలపడం వంటివి చేస్తున్నారు. మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు వారానికి ఒక్కొక్క ట్రాక్టర్‌కు రూ.5వేలు, నెలకు రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం. జిల్లాలో సుమారుగా 300లకు పైగా ట్రాక్టర్లు ఈ దందాలో భాగం అవుతున్నట్లు ప్రచారం. ఇందుకోసం ఓ ఇసుక మాఫియా డాన్‌ అందరి వద్ద వసూళ్లు చేయించి.. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ రవాణాశాఖ అధికారులకు వాటాలు ఇస్తున్నట్లు సమాచారం.

ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి ప్రైవేట్‌లో అమ్మకాలు

ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

కలెక్టర్‌ ఆదేశించినా ఆగని అక్రమ సరఫరా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement