భూ సమస్య కొలిక్కి.. | - | Sakshi
Sakshi News home page

భూ సమస్య కొలిక్కి..

Jun 24 2026 1:11 AM | Updated on Jun 24 2026 1:11 AM

సాక్షి, మహబూబాబాద్‌ : నారాయణపురం గ్రామ భూ సమస్య త్వరలో కొలిక్కి రానుంది. అధికారులు దీనికి సంబంధించిన ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అప్పట్లో ఉన్న తండాలను కలుపుకుని ఉమ్మడి నారాయణపురం గ్రామాన్ని నెల్లికుదురు మండలం చెట్లముప్పారం రెవెన్యూ గ్రామం నుంచి వేరుచేసి రెవెన్యూ విలేజ్‌గా మార్చారు. ఆ తర్వాత కేసముద్రం మండలంలో కలిపారు. ఈ క్రమంలో పొరపాటున అధికారులు ఆ గ్రామ భూములన్నింటినీ అటవీ శాఖలో కలపగా, అప్పటి నుంచి ఆ గ్రామ రైతులకు రైతుబంధు (ప్రస్తుతం రైతు భరోసా), రైతుబీమా, బ్యాంకు రుణాలు అందకుండా పోయాయి. ఆ తర్వాత పలుమార్లు ఆ గ్రామ రైతులు మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, దీక్షలు చేపట్టారు. అలాగే, అప్పటి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో వీరు పలు మార్లు అప్పటి కలెక్టర్‌ శశాంకతో చర్చించారు. చివరకు అప్పటి సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దకు కూడా ఈ సమస్య చేరింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. చివరకు సమస్యకు పరిష్కార మార్గం దొరికింది.

సిద్ధమవుతున్న

పట్టాదారు పాస్‌ పుస్తకాలు

పది సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు నోచుకోని నారాయణపురం రెవెన్యూ విలేజ్‌ రైతులకు త్వరలో పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించనున్నారు. ఇందుకోసం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి అధికారులు, ఉద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా తండ్రి పేరున ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేరు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం, చనిపోయిన వారి స్థానంలో వారసుల పేర్లు చేర్చడం, వివిధ కారణాలతో కాస్తులో ఒకరు, పట్టాదారుగా మరొకరు ఉన్న వాటిని పరిశీలించి నిజమైన రైతుకు పాస్‌ పుస్తకాలు అందచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ కేసముద్రం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి పాస్‌ పుస్తకాల పంపిణీకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగాయన్నారు. పాస్‌ పుస్తకాల తయారీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటే.. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పాస్‌ పుస్తకాలు ఇవ్వడమా.. మెడికల్‌ కళాశాల ప్రారంభానికి రానున్న సీఎం చేతుల మీదుగా ఇప్పించడమా అనే విషయంపై చర్చ జరుగుతోంది.

906 మంది రైతులకు 1,611 ఎకరాల భూమి పట్టాలు సిద్ధం

పొరపాట్లను సవరించే పనిలో

జిల్లా అధికార యంత్రాంగం

త్వరలో నారాయణపురం గ్రామ

అన్నదాతల చేతుల్లోకి పట్టాలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నారాయణపురం సమస్య తీరకపోవడంతో అక్కడి రైతులు పలుమార్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మురళీ నాయక్‌ ద్వారా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత 15 రోజుల నుంచి నారాయణపురం సమస్య పరిష్కరించాలని తహసీల్దార్‌ వివేక్‌ను ఆదేశించారు. దీంతో నారాయణపురం రెవెన్యూ పరిధిలోని నారాయణపురం, క్యాంపుతండా, పీక్లాతండా రైతుల భూమిని పరిశీలించి సర్వే నిర్వహించారు. చివరకు 1,411 భూ ఆధార్‌ మ్యాపింగ్‌లను గుర్తించారు. అటవీ, ఇతర ప్రభుత్వ భూములను వేరు చేశారు. చివరకు 906 మంది రైతులకు 1,611 ఎకరాల భూమి పట్టాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement