● ఎస్పీ శబరీష్
దంతాలపల్లి: గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్లాడ గ్రామంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతీ ఒక్కరు మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తే గ్రామాలు బాగుపడుతాయని అన్నారు. యువత మత్తుకు బానిసై తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ప్రాణాలను కోల్పోవడమే కాకుండా కన్నవారికి కడుపుకోత మిగిల్చిన వారవుతారని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ద్విచక్రవాహనం కలిగిన ప్రతీ ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి కుటుంబానికి రక్షణగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐ గణేష్, ఎస్సై రవికుమార్, వార్డు సభ్యులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.


