బడికి పంపకండి.. | - | Sakshi
Sakshi News home page

బడికి పంపకండి..

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

డబ్బులు ఇస్తేనే మీ పిల్లలకు చదువులు చెబుతాం

ఈ ఫొటోలో కనిపిస్తున్నది దంతాలపల్లి మండలం పెద్దముప్పా రం గ్రామానికి చెందిన ధర్మారపు వేణు. ఈయన కుమారుడు వరుణ్‌ తొర్రూరు పట్టణంలోని అబ్యాస్‌ ప్రైవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం కల్పించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం ద్వారా ఎంపికై న వరుణ్‌ ఆరో తరగతి నుంచి ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అయితే ‘రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు వి డుదల చేయడం లేదు.. మీ అబ్బాయికి చదువు చెప్పలేం.. మీకు ఫీజు చెల్లించే స్తోమత ఉంటేనే బడికి పంపించండి.. లేకపోతే వేరే పాఠశాలకు పంపించుకోండి’ అని పాఠశాల యాజమాన్యం మెసేజ్‌ పెట్టింది. దీంతో దిక్కుతోచని వేణు సోమవారం కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి తన బిడ్డ పరిస్థితి ఏమిటని ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు.’

సాక్షి, మహబూబాబాద్‌: ప్రతీ సంవత్సరం పలురువు పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిస్తోంది. ఇటువంటి బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బోధనతో పాటు, హాస్టల్‌ వసతి, పుస్తకాలు, దుస్తులు, టై, బెల్ట్‌, షూ మొదలైన ఖర్చులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. అయితే, నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని, ఈ ఏడాది జిల్లాలోని పలు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అంటున్నాయి. మరి కొన్ని పాఠశాలలు డబ్బులు చెల్లించి విద్యార్థులను పంపించాలని చెబుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న తల్లిదండ్రుల పిల్లలు బడికి వెళ్తుండగా.. నిరుపేద విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభం నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు.

బడికి వద్దంటూ..

జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా తొర్రూరు పట్టణంలోని అబ్యాస్‌ ప్రైవేట్‌ పాఠశాల, లిటిల్‌ప్లవర్‌, పీఎస్‌ఆర్‌, అర్యభట్ట, మహబూబాబాద్‌ పట్టణంలోని విద్యాభివర్థని, ఎస్‌వీ విద్యాలయంలో 496 మంది చదువుతున్నారు. షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖ ద్వారా తొర్రూరు పట్టణంలోని అబ్యాస్‌ స్కూల్‌ మహబూబాబాద్‌ పట్టణంలోని విద్యాభారతి, కృష్ణవేణి, గాదె రుక్మారెడ్డి, డోర్నకల్‌ పట్టణంలోని సెయింట్‌ హానర్స్‌ పాఠశాలలో 260 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా 756 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు ఏడాదికి రూ. 28వేల చొప్పున, 5నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 42వేలు, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 5నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 42వేల చొప్పున చెల్లిస్తారు. అయితే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదు. మొత్తం రూ. 5కోట్లకు పైగా డబ్బులు రావడం లేదు. ఇప్పుడు పలు పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు ఇస్తేనే పిల్లలను పంపండి అని చెబుతున్నాయి.

తల్లిదండ్రులు సతమతం

ఫీజులు చెల్లిస్తేనే పిల్లవాడిని బడికి పంపించాలని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదు. ఫీజులు చెల్లించే స్తోమత లేక పాఠశాలకు పంపించలేమని, అలాగని పిల్లవాడిని వేరే పాఠశాలకు పంపిస్తే చదువులు ఆగం అవుతాయని.. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రెండు, మూడు సార్లు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి పెండింగ్‌ బిల్లులు ఇప్పించాలని కోరారు.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ యాజమాన్యాల మెసేజ్‌

అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు

త్వరగా బకాయిలు చెల్లించాలని కలెక్టర్‌కు విన్నపం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement