గుర్తింపు రద్దు చేయాలి
ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులకు పుస్తకాలు అమ్మకాలు చేస్తున్న పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో గుర్తింపు రద్దు చేయాలి. జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు చేపట్టాలి. – బోనగిరి మధు,
పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. ఎంఈఓలు ప్రైవేటు పాఠశాలలను సందర్శించి అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాటించాలి.
– సత్యనారాయణమూర్తి, డీఈఓ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ కాకుండా యూనిఫామ్‌లు కూడా పాఠశాలల పరిధిలో సిబ్బందితో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎంతైనా వెచ్చించి నాణ్యమైన విద్యను అందించేందుకు పోటీ పడుతున్నారు. ఈ పోటీనే ప్రైవేట్ పాఠశాలల పాలిట కల్పతరువుగా మారుతోంది.
నిబంధనల ప్రకారం..
జిల్లాలో 121ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ గుర్తింపు పొందిన పుస్తకాలను తీసుకొని పాఠ్యాంశాలు బోధించాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంఈఓ కార్యాలయం ద్వారా వీరు పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఇక నోటుబుక్స్ విద్యార్థుల అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను గంపగుత్తగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కట్టబెట్టి తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. పుస్తకాల ధరలపై రెట్టింపుగా వసూలు చేయడం గమనార్హం.
ఇష్టానుసారంగా ధరలు..
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల ధరలు రూ.280 నుంచి రూ.648వరకు ఉన్నాయి. అదనంగా నోట్‌బుక్స్ కొనుగోలు చేయాల్సి ఉంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. గరిష్టం రూ.1,500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేల వరకు పుస్తకాల ఖర్చు అవుతుంది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల మోత మోగిస్తున్నాయి. యూకేజీ పుస్తకాలకు రూ.3100, స్పోర్ట్స్ డ్రెస్‌కు రూ.770, యూనిఫామ్‌కు రూ.750, టై ,బెల్ట్‌లకు రూ 200.. ఇలా అన్ని కలుపుకొని మొత్తం రూ.4800 వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.20 వేలు వరకు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ పుస్తకాల బిల్లు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న పుస్తకాలు
యథేచ్ఛగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ దందా
అధిక ధరలకు విక్రయాలు
విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు


