నాగోలు: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య అత్యంత దారుణంగా గొంతు నొక్కి హత్య చేసింది. ఆత్మహత్యగా నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆమెను ఎల్‌బీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్‌నాయక్ (33)కు బోడ స్వరూపతో 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు వరంగల్ గురుకుల పాఠశాలలో 10 వ తరగతి చదువుతుంది. చిన్న కూతురు హయత్‌నగర్‌లో 8వ తరగతి చదువుతుంది. కొత్త కాలంగా నర్సింగ్ తన భార్యతో కలిసి ఎల్‌బీనగర్‌లోని ఎన్టీఆర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. కాగా, బోడ స్వరూపకు తన స్వగ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. దీంతో కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి సర్ది చెప్పినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. మళ్లీ మూడురోజుల నుంచి గొడవలు జరుగుతుండడంతో.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపడానికి స్వరూప పథకం పన్నింది. ఈనెల 20న మధ్యాహ్నం తన భర్తను శారీరకంగా లొంగదీసుకుని, అతడి ఛాతీపై కూర్చొని చున్నీతో గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్యగా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నం చేసింది. అదేరోజు రాత్రి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటన స్థలాని కి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సింగ్ మృతిపై తన అన్న బిచ్యానాయక్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక ద్వారా నర్సింగ్‌ది హత్య అని తేలింది.
నిందితురాలి అరెస్టు..
నిందితురాలు స్వరూప భర్తను హత్య చేసి తన ప్రియుడికి ఫోన్ చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేసింది. ఈ మేరకు సోమవారం పోలీసులు స్వరూపను అల్కాపురి వద్ద అరెస్టు చేసి, విచారణ చేయగా తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఏకాంత సమయంలో భర్తను హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే!
ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం విఫలం
కేసు ఛేదించిన పోలీసులు.. భార్య అరెస్టు


