విత్తనానికో పండుగ | - | Sakshi
Sakshi News home page

విత్తనానికో పండుగ

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

తరాల ఆనవాయితీ

విత్తన పండుగను గుర్తించాలి

కొత్తగూడ : కడుపు నింపే ఎలాంటి ధాన్యం అయినా విత్తనం నుంచి రావాల్సిందే. అందుకే ఆదివాసీ సమాజం విత్తనాన్ని దైవ సమానంగా భావించి దీనిని మొదటి పండుగగా నిర్వహిస్తారు. తొలకరి పలకరించిందంటే ఏజెన్సీ గూడెల్లో విత్తన పండుగ సందడి మొదలవుతుంది. గ్రామంలోని పెద్దలు ఒక రోజు నిర్ణయించుకుని ఆ రోజు ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. ముందుగా ఇలవేల్పులకు ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. వెదురు బుట్టల ను ఆవు పేడతో అలికి పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. ఆ బుట్టల్లో నవ ధాన్యాలు పోసుకుని ఇంటికో బుట్ట తీసుకుని సంప్రదాయ వాయిద్యాలతో బొడ్రాయి (గ్రామ దేవత) వద్దకు చేరుకుంటారు. గ్రామ దేవతను నీటితో అభిషేకించి ముగ్గు వేసి చిన్న గొయ్యి నాగలి కర్రుతో తవ్వుతారు. గ్రామ పెద్ద గొయ్యిలో నవ ధాన్యాల్లో కొన్ని తీసి పోస్తాడు. అనంతరం మిగతా వారు తలా కొన్ని ఆ గొయ్యిలో వేస్తారు. దాన్ని పూడ్చి నీరు పోస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లిస్తారు. ఈ పండుగ చేయనిదే ఆదివాసీ గ్రామాల్లో ప్రజలు విత్తనం వేయరు. కాగా, శనివారం ఆదివాసీలు విత్తన పండుగ జరుపుకున్నారు.

గ్రామదేవత వద్ద నవధాన్యాలు వేస్తున్న కొత్తగూడ గ్రామస్తులు, వెదురు బుట్టల్లో నవధాన్యాలతో ఆదివాసీలు

మా తాతల కాలం నుంచి విత్తన పండుగ ఆనవాయితీగా వస్తోంది. విత్తనాన్ని మేం దైవంగా భావిస్తాం. విత్తనానికి పూజ చేయనిదే ఎవుసం మొదలు పెట్టం. గ్రామ దేవతల ఆశీర్వాదం, పంచ భూతాల సాకారం కోరుతూ విత్తన పండుగ చేసుకుంటాం.

– మల్లెల రామయ్య,

గ్రామపెద్ద, కొత్తపల్లి

ఆదివాసీ సమాజం ప్రకృతితో మమేకమై ఎన్నో పండుగలు నిర్వహిస్తుంది. అందులో విత్తన పండుగ ఒకటి. ఇలాంటి పండుగలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి. విత్తన పండుగకు ఒక తేదీ నిర్ణయించి సెలవు ప్రకటించాలి. ఉద్యోగులు, విద్యార్థులు విత్తన పండుగలో పాల్గొనే అవకాశం కల్పించాలి.

– నర్సింగరావు,

తుడుందెబ్బ నాయకుడు

ఆదివాసీ గూడెల్లో సందడి..

మృగశిర కార్తెతో వ్యవసాయం

మొదలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement