పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీలో తరలించారు. అయితే ఆ మృతదేహాలు కొంత సమయం వరకు దయనీయ స్థితికి చేరుకున్నాయి. పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై బోగం ప్రవీణ్, సిబ్బంది ఉదయం 10గంటలకే ఎంజీఎం మార్చురీ వద్దకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకే పోస్టుమార్టం నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించారు. దీంతో మృతుల బంధువులో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం..
ఒక్కొ మృతదేహానికి రూ.5,500 చెల్లిస్తేనే పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు ఖరాకండిగా చెప్పడంతో మృతుల బంధువులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ప్రక్రియకు డబ్బులు అడగడం సిగ్గుచేటన్నారు.
చరణ్‌కు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం..
మృతుడు బుద్దె చరణ్ స్నేహితుడు చరణ్ ప్రాణా పాయ స్థితిలో ఉండగా అతని బంధువులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. అయితే ఆస్పత్రిలో చేర్పించి రెండు గంటలు గడిచినా వైద్యులు చరణ్‌కు ప్రాథమిక చికిత్స చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు ఆరోపించారు. ప్రాథమిక చికిత్స చేయకపోవడంతో హనుమకొండ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స చికిత్స పొందుతున్నాడు.
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసు
ఉన్నతాధికారులు..
మండల కేంద్రంలోని ‘మారి’ సంస్థ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలిని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్ సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు.
పోస్టుమార్టం నిర్వహణలో వైద్యుల నిర్లక్ష్యం
ఒక్కో మృతదేహానికి రూ.5,500 చెల్లించాలని హుకుం
ఆందోళన వ్యక్తం చేసిన మృతుల
బంధువులు


