లింగాలఘణపురం : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారంలో ఓ ఆర్‌ఎంపీ వైద్యం వికటించి గౌసియాబేగం అనే మహిళ మృతి చెందండంపై డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు స్పందించారు. ఈ నెల 20న సాక్షిలో ‘ఆర్‌ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి డీఎంహెచ్‌ఓ స్పందించి మండల వైద్యాధికారి ఉదయ్‌కిరణ్‌ను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో సోమవారం ఆయన కుందారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సదరు మహిళ ఎప్పుడు మృతి చెందింది.. ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చిన ఆర్‌ఎంపీ ఇంటికి వెళ్లి విచారణ చేయగా తాను ఎలాంటి వైద్యం చేయడం లేదని, సదరు మహిళ ఓ ఇంజక్షన్ తీసుకొచ్చి ఇవ్వాలని వేడుకోవడంతో ఇచ్చానని, తాను ఎలాంటి వైద్యం చేయడంలేదని చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై మండల వైద్యాధికారి ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోరగా నివేదికను డీఎంహెచ్‌ఓకు సమర్పించనున్నట్లు వివరించారు.
డీఎంహెచ్‌ఓకు నివేదిక ఇవ్వనున్న
మండల వైద్యాధికారి


