డోర్నకల్ : డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని కొర్లకుంటకు వరద పోటెత్తితే చర్చి కాంపౌండ్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గతేడాది భారీ వర్షాలతో కొర్లకుంటకు వరద పోటెత్తి రైల్వే స్టేషన్, రైల్వే కాలనీలతో పాటు సుభాష్‌వీధి ముంపునకు గురయ్యాయి. కొంతమంది కుంటలోని కొంతభా గాన్ని ఆక్రమించి కట్టను తొలగించి చదును చేయడంతో కాల్వ నుంచి పెద్ద చెరువుకు వెళ్లాల్సిన వరద రైల్వే స్టేషన్‌ను ముంచెత్తి రైల్వే కాలనీల్లోకి వచ్చింది. ఆసమయంలో రైల్వే ఉద్యోగులు ఇబ్బందు పడ్డారు. ప్రస్తుతం అప్రమత్తమైన రైల్వేశాఖ కుంటకు అడ్డుగా రక్షణ గోడ నిర్మిస్తోంది. కాగా, కుంట కాల్వ పూడుకుపోవడంతో వరద వస్తే చర్చికాంపౌండ్‌తో పాటు పలు కాలనీలు నీట మునగనున్నాయి.
20 ఎకరాల్లో కుంట..
రైల్వే జంక్షన్ సమీపంలో 19, 21 సర్వే నంబర్లలో 20 ఎకరాల్లో కొర్లకుంట విస్తరించి ఉండగా దీనిలో 12 ఎకరాల భూమి ఓ వ్యక్తి పేరిట పట్టా ఉంది. ఎగువ ప్రాంతంలోని గార్ల మండల పరిధి వెంకటాపురం, వడ్లకుంట, శనగకుంట తదితర ప్రాంతాల్లోని వరద నీరు కొర్లకుంటకు చేరుకుని తూము మత్తడి ద్వారా జయపురం, చర్చి కాంపౌండ్, నెహ్రూస్ట్రీట్ ప్రాంతాల మీదుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర కాల్వ నుంచి పెద్ద చెరువుకు వరద ప్రవహిస్తుంది.
ముంచెత్తిన వరద..
గత ఏడాది సెప్టెంబర్ 30న భారీ వర్షాలతో కొర్లకుంటకు వరద పోటెత్తింది. కుంట నుంచి వరద వెళ్లే మార్గం లేకపోవడంతో సమీపంలోని రైల్వే ట్రాక్ మీదుగా రైల్వే స్టేషన్‌లోకి భారీ వరద ప్రవేశించింది. దీంతో రైల్వే ట్రాక్ మునగడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచాయి. రైల్వే స్టేషన్ నుంచి వరద రైల్వే కాలనీల్లోని ఇళ్లను ముంచెత్తడంతో రైల్వే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేషన్‌లోకి వరద రావడంతో 24 గంటల పాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి.
మేల్కొన్న రైల్వేశాఖ...
కొర్లకుంట వరద రైల్వే స్టేషన్‌ను ముంచెత్తడంతో మేల్కొన్న రైల్వేశాఖ కుంట పక్కన రైల్వే జంక్షన్ పరిధి స్థలంలో భారీ గోడ నిర్మాణం చేపట్టింది. కుంట పరిధిలో భవిష్యత్‌లో వరద ముప్పు రాకుండా గోడను పటిష్టంగా నిర్మిస్తున్నారు.
కొర్లకుంటకు అడ్డుగా రైల్వేశాఖ
రక్షణ గోడ నిర్మాణం
గత వానాకాలంలో రైల్వే స్టేషన్, రైల్వే
కాలనీలను వరద ముంచెత్తడంతో నిర్ణయం
మూసుకుపోయిన కాల్వతో
చర్చి కాంపౌండ్‌కు తీవ్ర ముప్పు
పలు కాలనీవాసుల ఆందోళన
పాలకుల నిర్లక్ష్యం..
కొర్లకుంట ఆక్రమణకు గురి కావడం, రైల్వేశాఖ గోడ నిర్మించడంతో కుంటకు వరద పోటెత్తితే జయపురం, చర్చికాంపౌండ్, న్యూనెహ్రూస్ట్రీట్, కిరీటాపురంనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కొర్లకుంట నుంచి పెద్ద చెరువు వరకు ఉన్న కాల్వ ప్రస్తుతం చెట్లు, చెత్తతో మూసుకుపోయింది. గోడ నిర్మాణం, కాల్వ మూసుకుపోవడంతో తమకు వరద ముప్పు ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొర్లకుంటకు వరద పోటెత్తి కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనా మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు నే టికీ స్పందించలేదు. కుంటకు పూర్తిస్థాయి కట్ట నిర్మించడం, కాల్వలోని చెట్లను తొలగించి శుభ్రపరచడం ద్వారా వరద ముప్పును అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రాంరభం కావడంతో మున్సిపాలిటీ అధికారులు ముప్పును అధికమించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


