డోర్నకల్: డోర్నకల్, గార్ల మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తారు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. డోర్నకల్, గార్ల మార్గంలో 90వ రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద నూతనంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయి, చిన్నచిన్న పనులు వల్ల వాహనాల రాకపోకలకు అనుమతివ్వడం లేదు. ఈమేరకు సాక్షి దినపత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. బ్రిడ్జిపై తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రేపటి నుంచి విత్తన మేళా
మహబూబాబాద్ రూరల్: వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 23నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు విత్తనమేళా జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయచంద్ర అన్నారు. విత్తన మేళా ఏర్పాట్ల వివరాలను డీఏఓ ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 59 రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహిస్తామని, వివిధ రకాలైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ విత్తన మేళాలో వరిలో సన్న రకాలైన బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్‌ఎం 1638, కేఎంఎం 7715, హెచ్‌ఎంటీ సోన, జైశ్రీరామ్ వంటి ప్రభుత్వం సూచించిన సన్న రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. వాటితో పాటు పెసర, కంది, మినుము, అపరాల విత్తనాలు, వివిధ రకాలైన కూరగాయల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గుళిక రూపంలో ఉండే యూరియాకు ప్రత్యామ్నాయమైన నానో యూరియా, నానో డీఏపీలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న రైతు వేదికను సందర్శించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని దక్షిణం, పడమర, ఉత్తరం వైపు వరకు ఉన్న ప్రాకార దేవతామూర్తుల విగ్రహాలను తమిళ శిల్పులు తొలిగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన సుమారుగా 50కిపైగా విగ్రహాలను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో విగ్రహాలు భద్రపరచడానికి కింద వరిధాన్యం పోసినట్లు తెలిసింది. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 23న హైదరాబాద్‌లో టెండర్లు పూర్తి కానున్నట్లు సమాచారం. అనంతరం ఆలయాల కూల్చివేతలు ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే రాతితో కట్టడాల నమూనా చిత్రాలను కమిషనర్ హనుమంతరావు విడుదల చేసిన విషయం తెలిసిందే.


