ప్రత్యామ్నాయమే మేలు.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయమే మేలు..

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

మహబూబాబాద్‌ రూరల్‌: వరుణుడు కరుణించడం లేదు. పంటల సాగుకు అదును దాటుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరి, పత్తి పంటలకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పప్పు దినుసులు, కూరగాయల సాగు చేయాలని అంటున్నారు. తక్కువ నీటి వినియోగం, పంటల సాగు సమయం తక్కువగా ఉండటం, తక్కువ పెట్టుబడితో కర్షకులు పంటలు సాగు చేయవచ్చని పేర్కొంటున్నారు.

కందిపంట..

కంది పంటకు ఎర్ర నేలలు, నీరు నిల్వ ఉండని భూములు అనుకూలం. జూన్‌ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 4 నుంచి 5 కిలోల విత్తనాలు అవసరం. ఇది వర్షాధార పంట, అవసరమైతే పూత, కాత దశలో నీరు ఇవ్వాలి. కాగా, ఎకరానికి 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

పెసర పంట..

పెసర పంటను తేలికపాటి నుంచి మధ్యస్త నేలల్లో పండించొచ్చు. ఖరీఫ్‌లో జూన్‌ నుంచి జూలై, రబీలో అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. పంటకు 2 నుంచి 3 తడులు సరిపోతాయి. ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

మినుము పంట..

మినుము పంట సారవంతమైన ఎర్ర, నల్ల నేలల్లో పండుతుంది. ఖరీఫ్‌లో జూన్‌ నుంచి జూలై, రబీలో అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం. అవసరాన్ని బట్టి 2 నుంచి 3 వరకు నీటి తడులు అందించాలి. ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

చిరుధాన్యాల సాగులో..

చిరుధాన్యాలు (సజ్జలు, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు మొదలైనవి) తక్కువ నీటితో సాగు చేయగల పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు. మంచి దిగుబడి కోసం అధికారుల సూచనలు పాటించాలి. అలాగే వేరుశనగ, శనగ కూరగాయల పంటలు పండించుకోవచ్చు.

కూరగాయలతో లాభాలు..

వర్షాభావ పరిస్థితుల్లో కూరగాయల సాగు ద్వారా లాభాలు సాధించవచ్చు. టమాట, వంకాయ, మిర్చి, బీరకాయ, బెండ తదితర పంటలు సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. నాణ్యమైన, మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే విత్తనాలు నాటి అధిక దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

వర్షాలు ఆలస్యం..

ఆరుతడి పంటలు అనుకూలం

పప్పు దినుసులు, కూరగాయల సాగు మేలుదాయకం

అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement