మహబూబాబాద్ రూరల్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి అన్నారు. ఇన్‌చార్జ్ జిల్లా జడ్జి ఎం.ఆర్.సునీత ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భం శాలిని షాకెల్లి మొదటగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి 2017లో దాఖలైన ఒక సివిల్ వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించి లోక్ అదాలత్ అవార్డును జారీ చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ విలువైన సమమం, డబ్బును ఆదా చేసుకోవడంతో పాటు సమాజంలో శాంతి సామరస్యాలు నిలదొక్కుకుంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గంగా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, ఇందుకు న్యాయవాదులు తగిన సహకారం అందిస్తారన్నారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి 94 కేసులు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ 206 కేసులు, రెండో శ్రేణి మేజిస్ట్రేట్ రవికుమార్ 2,078 పెట్టి కేసులు రాజీమార్గంలో పరిష్కరించా రు. 10 ఇతర సివిల్ కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాదులు తోర్నాల నగేష్ కుమార్, ఆరెల్లి శ్రీనివాస్, తాటిపాముల సునీత, న్యాయవాదులు జి.కమల్ కుమార్, ఎన్.శృతి, కె.మౌనిక, వి.సుభాష్, టి.సైదులు తదితరులు పాల్గొన్నారు.
కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి..
తొర్రూరు: లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ కోరారు. శనివారం డివిజన్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ధీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. చిన్న, చిన్న సమస్యలతో గొడవ పడి పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న శాంతియుత మార్గంలో పరిష్కరించుకుంటూ మంచి జీవితాన్ని పొందాలన్నారు. రాజీమార్గం ద్వారా 391 పరిష్కరించగా, రూ.16.67 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సెకండ్ క్లాస్ జడ్జి రాంరెడ్డి, పీపీ రేవతిదేవి, న్యాయ వాదులు, కానిస్టేబుళ్లు, కక్షిదారులు పాల్గొన్నారు..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి


