● పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై కలెక్టర్ అసంతృప్తి
బయ్యారం: ఇంగ్లిష్ మీడియం పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌లోనే బోధించడంతో పాటు మాట్లాడాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని సీపీఎస్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు ముస్తాఫానగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీపీఎస్ పాఠశాలలో తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల హాజరుతీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ జరిగిందా లేదా అని ఆరా తీశారు. నోట్‌పుస్తకాలు పంపిణీ చేయకపోవంతో అసహనం వ్యక్తం చేసి వెంటనే అందజేయాలని హెచ్‌ఎంను ఆదేశించారు. అనంతరం తరగతిగదిలో కూర్చొని ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠం తీరును గమనించారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు తెలుగులో పాఠాలు బోధించటం సరికాదని, ఇంగ్లిష్‌లోనే బోధించాలని, విద్యార్థులతో ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలన్నారు. బయ్యారం బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో బోధించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మీడియం బోధనపై ప్రత్యేకదృష్టి సారించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. లోపాలు లేకుండా విద్యావ్యవస్థను నడిపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న వంట వర్కర్లందరికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. అనంతరం ముస్తాఫానగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన పిల్లల వివరాలను రిజిస్టర్‌లో పరిశీలించి వారితో మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, ఎంఈఓ లక్ష్మణ్‌రావు, ఎస్సై ప్రశాంత్, పాఠశాల హెచ్‌ఎంలు ధనుంజయ్, బాలునాయక్ తదితరులు ఉన్నారు.
గడువులోగా ఆస్పత్రి పనులు పూర్తిచేయాలి
● ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్
మరిపెడ: నిర్ణీత గడువులోగా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ ఆదేశించారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీలోని 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరిపెడలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరిపెడ పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, జిల్లా మైనార్టీ నాయకులు అఫ్జల్, జర్పుల విజయ్ తదిరులు పాల్గొన్నారు.


