● మానుకోట మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్
మహబూబాబాద్: ‘మా నాన్న హమాలీ పని చేసి ఉన్నత చదువులు చదివించారు.. నేను కలెక్టర్ కావాలని కలలు కన్నారు. అయితే డీఎస్పీ కొంచెంలో మిస్సై కమిషనర్ అయ్యా’ అని మానుకోట మున్సిపల్ కమిషనర్ ఎం.వినోద్‌కుమార్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా కమిషనర్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మారుమూల తండా నుంచి..
మాది నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిశర్ల మండలం(పీఏ పల్లి)లోని పెద్దగట్టు తండా. మా తల్లిదండ్రులు మూడావత్ శంకర్, బుజ్జి. అమ్మానాన్నలకు ఇద్దరు కొడుకులం.. నేను పెద్దవాడిని. మాది మారుమూల తండా కావడంతో కొన్ని సంవత్సరాలు కరెంట్ సక్రమంగా లేదు. దీంతో పంటలు పండేవికాదు. మా చదువుల కోసం మా నాన్న మిర్యాలగూడ ఎఫ్‌సీఐ గోదాంలో హమాలీ పని చేశారు. తండాలోనే ఐదో తరగతి వరకు చదువుకున్న. తర్వాత మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన. గుంటూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్(ఎంపీసీ)పూర్తి చేశా. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీర్ పూర్తి చేశా. అనంతరం యూపీఎస్‌సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కోసం ఢిల్లీ వెళ్లిన.. ఐఏఎస్ కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ రాలేదని కమిషనర్ వినోద్‌కుమార్ అన్నారు.
2025లో గ్రూపు–1లో..
2025 మార్చిలో విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో సెలెక్ట్ అయి మున్సిపల్ కమిషనర్ పోస్టు సాధించించా. డీఎస్పీ కోసం ప్రయత్నించినా.. కొంచెంలో మిస్ అయినట్లు కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. మానాన్న కష్టం గుర్తుకు వచ్చి కష్టపడి చదివినా కలెక్టర్ ఉద్యోగం రాలేదు. మళ్లీ చదివి నాన్న కల నెరవేర్చడమే నా లక్ష్యం. నాన్నే నాకు అన్ని విషయాల్లో ఆదర్శం.


