సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు డీజీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యుటేషన్ సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ టీజీపీఓఏ ఎన్నికలు ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ ఎంఎస్ నం:539 (06.08.1979), జీఓ ఎంఎస్ నం: 113 (16–06–2008) నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యుటేషన్ సంస్థల్లో ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని, జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల నిర్మాణం జరగాలని డీజీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లాలు, కమిషనరేట్‌లలో పదవుల విషయానికి వస్తే ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక్కోటి చొప్పున కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి పోస్టులు, ఆరుగురు కార్యవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
జిల్లాలు, కమిషనరేట్లలో ఇలా..
అధ్యక్ష పదవి సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్‌కు చెందిన అధికారి చేపట్టవచ్చు. అధ్యక్షుడిగా ఎస్‌ఐ/ఇన్‌స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్‌గా ఉండాలి. అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులుగా ఉండాలి. కార్యదర్శి పదవి ఎస్‌ఐ/ఆర్‌ఎస్‌ఐ లేదా అంతకంటే పైస్థాయి అధికారులకు మాత్రమే. కోశాధికారి పదవి సివిల్ పోలీస్ విభాగానికి చెందిన ఏ ర్యాంకు అధికారి అయినా చేపట్టవచ్చు. కార్యవర్గ సభ్యుల్లో నలుగురు సివిల్ పోలీస్ నుంచి, ఇద్దరు ఆర్ముడ్ రిజర్వ్ (ఏఆర్) నుంచి ఎన్నిక కావాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానం మహిళా పోలీసులకు రిజర్వ్ చేస్తారు.
మెట్రో కమిషనరేట్లకు ప్రత్యేక కమిటీలు..
పదవులు ఇలా..
హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఉమెన్ పోలీస్ యూనిట్లకు ప్రత్యేక కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలలో ఒక అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక్కోటి చొప్పున కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కోశాధికారి పోస్టులు ఉంటాయి. అసిస్టెంట్ కార్యదర్శులు ఇద్దరు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఐదుగురు, కార్యవర్గసభ్యులు 14 మంది ఉంటారు. ఆర్గనైజింగ్ కార్యదర్శుల కోటాలో ఇద్దరు లా అండ్ ఆర్డర్, ఒక్కొక్కరు క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచిల నుంచి అవకాశం ఉంటుంది.
సీఏఆర్ యూనిట్‌కు సఫరేట్..
సిటీ ఆర్ముడ్ రిజర్వుడు (సీఏఆర్) యూనిట్‌కు ప్రత్యేక కమిటీ ఉండనుంది. ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక్కోటి చొప్పున కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పోస్టులు, ముగ్గురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 8 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు అసోసియేషన్ బైలాస్ ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నవంబర్ మొదటి వారంలో నిర్వహించాల్సి ఉండగా, అంతకు ముందు జిల్లా, యూనిట్ కమిటీల ఎన్నికలు ఆగస్టు ప్రారంభంలో మొదలై సెప్టెంబర్ చివరి నాటికి ముగించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యూటేషన్ సంస్థల్లో ఎన్నికలు 2026 సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని డీజీపీ ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత టీజీపీఓఏ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. పోలీసుశాఖలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది.
పోలీస్ శాఖలో మళ్లీ ఎన్నికల సందడి
జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి వరకు
పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి
నోటిఫికేషన్ జారీ చేసిన
డీజీపీ సీవీ ఆనంద్
ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత
టీజీపీఓఏ ఎన్నికలు


