ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

హన్మకొండ అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి, డీసీపీ ధార కవితతో కలిసి భూ సమస్యలు, అట్రాసిటి కేసులు, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీపై సమీక్ష నిర్వహించారు. అట్రాసిటి కేసుల నమోదు నుంచి చార్జ్‌షీట్‌ దాఖలు వరకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు చట్టప్రకారం రక్షణ, ఆర్థిక సాయం, పునరావాసం, న్యాయ సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే వినియోగించాలని, పెండింగ్‌ భూ సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో కార్మికులకు తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి మాట్లాడుతూ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. భద్రకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కుటుంబాలకు న్యూ శాయంపేటలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అనంతరం చెరబండరాజు కాలనీకి చెందిన అర్హులైన కుటుంబాలకు ఇళ్ల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. ఉన్నతాధికారులు, దళిత సంఘాల నాయకులు రడపాక పరంజ్యోతి, సింగారపు రవిప్రసాద్‌, మంద కుమార్‌, పుట్టరవి తదితరులు ఉన్నారు.

భూ సమస్యలు, అట్రాసిటి కేసులపై ప్రత్యేక దృష్టి

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement