ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి చెందని వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి చెందని వరంగల్‌

Jun 21 2026 12:43 AM | Updated on Jun 21 2026 12:43 AM

హన్మకొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభివృద్ధి చెందలేదని, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక్క విద్యా సంస్థ రాలేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఆమె హనుమకొండ, వరంగల్‌లో పర్యటించారు. వరంగల్‌లోని ఏనుమాముల, హనుమకొండలోని కేయూసీ వద్ద టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ బాలసముద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ వచ్చి రూ.5,200 కోట్లతో నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రేనేజీ నిర్మిస్తామని చెప్పినా దిక్కు మొక్కు లేదన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా అతిగతీ లేదని విమర్శించారు. కనీసం మాస్టర్‌ప్లాన్‌ రూపొందించుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లానని అక్కడ ఎక్కడా చూసిన ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, ధాన్యం కొనే వారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను మిల్లర్లు దోచుకుంటుంటే, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రం మిల్లర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటుందని, అందుకే మిల్లర్లు ముందుకు రావడం లేదని తూర్పారబట్టారు. వరంగల్‌ టెక్స్‌టైల్స్‌ పార్కుకు పరిశ్రమలు తీసుకురాకుండా, 2,400 ఎకరాల పార్కు స్థలాన్ని లేఅవుట్‌ చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించి పరిశ్రమలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ గొప్పలు చెప్పుతున్న మామునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పూర్తి కాలేదన్నారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో స్థానికులకే 90 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వచ్చామన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రూప్‌సింగ్‌, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల ఇన్‌చార్జ్‌ నడిపల్లి వెంకటేశ్వర్‌ రావు, నాయకులు ఇస్మాయిల్‌, డేవిడ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌, రాజు యాదవ్‌, శ్రీశైలం, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు

కల్వకుంట్ల కవిత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement