ప్రాణం తీస్తున్న రక్తబంధం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీస్తున్న రక్తబంధం!

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

మళ్లీ పాత రోజులు రావాలి..

హైటెక్‌ యుగంలో రోజుకో ఆవిష్కరణలు వస్తున్నాయి. అయితే ఈ మార్పు పనులు సులువుగా కావడం కోసం, విజ్ఞానాన్ని పెంపొందించడానికి వినియోగించాల్సింది పోయి వినాశనానికి వినియోగిస్తున్నారు. కుటుంబ బంధాలు, బంధుత్వాలు, విలువలు తగ్గుతున్నాయి. ఆస్తుల కోసం కొట్లాటలు, వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు పెద్దపీట. కానీ, ఇప్పుడు ఇది ప్రమాదంలో పడింది. మళ్లీ పాత రోజులు రావాలి.

– పాల్వాయి రామ్మాహన్‌ రెడ్డి, ప్రముఖ వైద్యుడు

హత్యలతో సమస్యలు పరిష్కారం కావు

జిల్లాలో కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడం వంటి సంఘటనలు తరచూ జరగడం విచారకరం. ఆస్తులు, భూ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు చట్టాలు ఉన్నాయి. క్షణికావేశంలో హత్యలు చేయడం సరికాదు. నేర ప్రవృత్తిలో మార్పు, సామాజిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం తగ్గితే హత్యా నేరాల సంఖ్య కూడా తగ్గుతుంది. – శబరీష్‌, ఎస్పీ

సాక్షి, మహబూబాబాద్‌: ప్రస్తుత సమాజంలో బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండాపోయింది. రక్తసంబంధీకులే దాడులకు పాల్పడడం, హత్యలు చేస్తున్న సంఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. చిన్నచిన్న వివాదాల వల్ల తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి, అన్నను తమ్ముడు, తమ్ముడిని అన్న, అల్లుడిని మామ, భార్యను భర్త, భర్తను భార్య ఇలా కర్కషంగా హతమార్చుతున్నారు. జిల్లాలో ఏడాదికాలంలో 10 సంఘటనల్లో 13 మంది హత్యకు గురయ్యారు. కాగా, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవ్వడమే ఇందుకు కారణమని పెద్దలు అంటున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు..

జిల్లాలో అయిన వారే కుటుంబ సభ్యులను చంపిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో 10 సంఘటనల్లో 13 మంది హత్య, ఆత్మహత్య కు పాల్పడ్డారు. గార్ల మండలంలో పిల్లను ఇచ్చిన అత్తను అల్లుడు హతమార్చిన ఘటనపై ఇప్పటికీ చర్చ సాగుతోంది. అదే మండలంలో సోదరి, కన్నతండ్రి కలిసి కుమారుడిని హత్య చేసిన ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కురవి మండలంలో అన్నదమ్ముల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోనే జరిగిన దాడిలో అన్న చేతిలో తమ్ముడు మృతి చెందాడు. మహబూబాబాద్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రేమికురాలిపై ప్రియుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అయితే భయంతో ఆమె అతడిని హత్తుకుంది. ఈఘటనలో ఇద్దరు మృతిచెందారు. కొడుకు తల్లిని చంపిన ఘటనపై తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇరువైపులా పెద్దలు కలిసి పెళ్లి కుదిర్చారు. పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి భాజా మోగాల్సిన ఇంట్లో.. చావు డప్పు మోగింది. వధువును వరుడు బావిలో తోసేసి చంపేసిన ఘటనపై మరిపెడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నతండ్రి ఇద్దరు కుమారులను చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకొని మరణించిన సంఘటన తొర్రూరు మండలం అమ్మాపురంలో జరిగింది. భర్తను భార్య చంపిన ఘటన గూడూరు మండలంలో జరిగింది

అయినవారే ఆయువు తీస్తున్న ఘటనలు

జిల్లాలో ఏడాదిలో 13 మంది హత్య

కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవ్వడమే కారణమంటున్న పెద్దలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement