గార్ల: గార్ల డిప్యూటీ తహసీల్దార్‌గా భూక్య శ్రీరాంరాథోడ్‌ను నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం
తొర్రూరు: సికిల్‌సెల్ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యంగా పని చేయాలని తొర్రూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని సికిల్‌సెల్ ఎనీమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుగుణాకర్‌రాజు మాట్లాడుతూ.. మేనరిక వివాహాలు, వంశపారపర్యంగా సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి సంక్రమిస్తుందన్నారు. అందుకే ప్రతీ కుటుంబం అవగాహనతో ఉంటూ ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జ్వలిత, నందనాదేవి, ప్రియాంక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషకాహారం అందించాలి
మహబూబాబాద్ అర్బన్ : చిన్నారులు, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నాణ్యమైన పోషకాహారం అందిస్తుందని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు హైజెనిక్, హెల్తీ మీల్ ప్రిపరేషన్ అంశంపై ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, కుక్, హెల్పర్లు ఆహార పదార్థాల సురక్షిత నిల్వ, వంటశాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత ఆహార తయారీ విధానాలు, పోషకాహార ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పి.వీరయ్య, నరేందర్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, జిల్లా కోఆర్డినేటర్లు పి.పూర్ణచందర్, వి.సురేష్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఇన్‌చార్జ్ ఎం.గణేష్, శ్రీకాంత్, సాయిచరణ్, ముజాహిద్ అలీ పాల్గొన్నారు.
ఆకేరు వాగు పరిశీలన
నర్సింహులపేట: మండలంలోని ఆకేరు వాగును తొర్రూరు ఆర్డీఓ గణేష్, జిల్లా గనులు, భూగర్భ సహాయ సంచాలకులు వెంకటరమణ, తొర్రూరు సీఐ గణేష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. మండలంలోని ముంగిమడుగు, రామన్నగూడెం, జయపురం, కౌసల్యదేవిపల్లి పరిధిలో వాగును పరిశీలించారు. ఇసుక లభ్యత, రీచ్‌ల వద్ద భద్రత, ఇసుక అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్‌బాబు, ఎస్సై బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్ రూరల్: వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండలస్థాయి అధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీ సీఈఓ పురుషోత్తం హాజరై మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబ లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలు, తండాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాల ని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉన్నప్పుడే సమస్యలు రాకుండా చూడగలు గుతామన్నా రు. వర్షాలు, వరదల వల్ల గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ రఘుపతిరెడ్డి ఉన్నారు.


