అప్రమత్తతే ఆయుధం! | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే ఆయుధం!

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

నెహ్రూసెంటర్‌: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. జిల్లాలోని గ్రామాలు, గూడేలు, తండాల్లో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, విష జ్వరాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ ఏడాది జిల్లాలో సుమారు 500 డెంగీ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, వేడిచేసి చల్లారిన నీటిని మాత్రమే తాగాలని, రోగాలపై అవగాహన పెంచుకుని సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.

500పైగా కేసుల నమోదు..

జిల్లాలో ఏటా సుమారు 500లకు పైగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మలేరియా, టైఫాయిడ్‌, విష జ్వరాల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మహబూబాబాద్‌, కేసముద్రం, గూడూ రు, కురవి, డోర్నకల్‌, గార్లతో పాట ఇతర మండలాల పరిధిలోని ప్రజలు డెంగీతో పాటు విష జ్వ రాల బారిన పడుతుండడం గమనార్హం. అత్యధిక డెంగీ కేసులు పట్టణ పరిధిలోనే నమోదుకావడం అందోళన కలిగించే అంశం.

పారిశుద్ధ్యమే ప్రధాన సమస్య..

డెంగీ, మలేరియా, విష జ్వరాలకు పారిశుద్ధ్యమే కారణమని తెలుస్తోంది. వర్షపు నీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్య లోపం, చెత్తా చెదారం కారణంగా దోమలు నివాసం ఏర్పాటు చేసుకుని వాటి వల్ల వ్యాధులు సంభవిస్తున్నాయి. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు.

వైద్యారోగ్యశాఖ యాక్షన్‌ప్లాన్‌..

సీజనల్‌ వ్యాఽధులను నివారించేందుకు వైద్యారోగ్యశాఖ యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి వైద్య అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్‌సీ, జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి వైద్య సేవలను పెంచేలా, కేసుల పెరుగుదలను నివారించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండేళ్లుగా డెంగీ, మలేరియా కేసులు 500 మార్కును దాటడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న యాక్షన్‌ప్లాన్‌ అమలు ద్వారా కట్టడి చేస్తారా లేదా అనేది వేచిచూడాలి.

వానాకాలం ప్రారంభంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం

పరిసరాల పరిశుభ్రత,

అవగాహన తప్పనిసరి

జిల్లాలో డెంగీ, మలేరియా అత్యధిక కేసులు

ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తగిన చర్యలు

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి 01

పీహెచ్‌సీలు 20

అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ 01

బస్తీ దవాఖానా 01

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 05

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement