● శాలపల్లిలో ఘటన
వేలేరు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై అజ్మీరా సురేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదరి కొమురయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని సుమారు రూ. 10 లక్షల అప్పు చేసి కొనుగోలు చేశాడు. అయితే అప్పు ఎలా తీర్చాలని మనస్తాపం చెందుతున్నాడు. కాగా, కొద్ది రోజులుగా మద్యం సేవిస్తూ కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. దీంతో భార్య, కుమారులు.. తాగి ఎందుకు గొడవ చేస్తున్నావని మందలించడంతో మనస్తాపం చెందిన కొమురయ్య శుక్రవారం పురుగుల మందు ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


