గుంటూరు టు గుండెపూడి | - | Sakshi
Sakshi News home page

గుంటూరు టు గుండెపూడి

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

వరుస కేసులు నమోదు రైతులకు ముప్పే.. నిఘా ఎక్కడ?

మూడేళ్లుగా కొనసాగుతున్న దందా..

గుంటూరు నుంచి రహస్య రవాణా..

మరిపెడ రూరల్‌: ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం జిల్లాల్లో ఈ ఏడాది కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. గుంటూరు ప్రాంతం నుంచి రహస్యంగా తెప్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబా బాద్‌ జిల్లా మరిపెడ మండంలోని గుండెపూడి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు స్థానికులు సిండికేట్‌గా ఏర్పడి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

ఒకరి చూసి మరొకరు నిషేధిత పత్తి గింజల వ్యాపారాన్ని ఎంచుకుని కేసుల పాలు అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే గ్రామానికి చెందిన పలువురు బీటీ–3 విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడడంతో పలు ధఫాలుగా ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. మళ్లీ ఈ ఏడాది గుండెపూడికి చెందిన ఓ వ్యక్తి బంధువులను మధ్యవర్తులుగా చేసుకుని తొర్రూరు ప్రాంతంలో బీటీ–3 విత్తనాలు విక్రయిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి సూర్యాపేట జిల్లా నూతనకల్‌ ప్రాంతంలో విక్రయిస్తూ అక్కడి పోలీసులకు గురువారం పట్టుబడినట్లు తెలిసింది. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒకే గ్రామంలో 5 కేసులు నమోదయ్యాయి. ఈ వరుస ఘటనలు బయటపడుతున్నా గుండెపూడి కేంద్రంగా కొత్త వారు కూడా ఈ వ్యాపారంలోకి దిగుతూ ఆయా జిల్లాల్లో దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సాగుకు గ్‌లైకోసెట్‌ గడ్డి మందులు పిచికారీ చేయడం కారణంగా భూసారం దెబ్బతినడంతోపాటు కేన్సర్‌, వివిధ రుగ్మతులను ఎదుర్కోవాల్సిన అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోతే పెట్టుబడి మొత్తం వృథా కావడంతో పాటు భవిష్యతులో పత్తి సాగుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రతీ సంవత్సరం ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నా పోలీస్‌, వ్యవసాయ శాఖల నిఘా సరైన స్థాయిలో లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుండెపూడి కేంద్రంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖలు సమన్వయంతో ప్రత్యేక దాడులు నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, సాగు సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

పట్టుబడిన ప్రభుత్వ నిషేధిత

బీటీ–3 పత్తి విత్తనాలు

కొనసాగుతున్న నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాల అక్రమ దందా!

ఉమ్మడి వరంగల్‌, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తరించిన విక్రయాలు

ఇటీవల వెలుగు చూసిన తొర్రూరు, నూతనకల్‌ అరెస్ట్‌ ఘటనలు

అధికార యంత్రాంగం నిఘా లోపంతో రెచ్చిపోతున్న సిండికేట్లు

ఈజీమని కోసం గుండెపూడి గ్రామంలోని కొందరు అక్రమ పత్తి గింజల వ్యాపారంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారం ఒక్కసారిగా ప్రారంభమైనది కాదని, మూడేళ్లుగా కోట్ల రూపాయల టర్నోవర్‌తో కొనసాగుతోందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమతి లేని ఈ విత్తనాల ప్యాకెట్‌ను సాధారణం కంటే ఎక్కువ రూ.1,500 నుంచి రూ.1,800 ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక దిగుబడి వస్తుంది.. పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది వంటి ప్రచారాలతో రైతులను ఆకర్షిస్తున్నారని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతం నుంచి బీటీ–3 పత్తి విత్తనాలను చిన్న లాట్లుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలలోనే దిగుమతి చేసుకున్న ఈ విత్తనాలను అదే నెలలో మరిపెడతో పాటు చుట్టుపక్కల మండలాల రైతులకు విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement