విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే అని అన్నదాతల ఆగ్రహం

తమకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై ధర్నా

● ప్రాథమిక దర్యాప్తులో జేఎల్‌ఎంను సస్పెండ్‌ చేసిన అధికారులు

వర్ధన్నపేట: విద్యుదాఘాతంతో ఓ గిరిజన రైతు మృతి చెందాడు. ఈ ఘటన వర్ధన్నపేట పట్టణ ప రిధిలోని బావనికుంట తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన నూనావత్‌ గణేశ్‌(31) తన వ్యవసాయ క్షేత్రంలో దుక్కి దున్నుకుని మండె కట్టాడు. వరి మొలకలు అలకడానికి శుక్రవారం అన్ని సమకూర్చుకోగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక జూనియర్‌ లైన్‌మెన్‌ లకావత్‌ శేఖర్‌కు ఫోన్‌లో సమాచారం అందించగా ఆయన ఎల్‌సీ ఇచ్చారు. విద్యుత్‌ తీగలు కలుపుకోమని గణేశ్‌కు ఫోన్‌లో తెలిపాడు. దీంతో గణేశ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగలు సరి చేస్తున్న క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ గణేశ్‌ను కాపాడాలని యత్నించినా చనిపోయాడు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ కుటుంబీకులతోపాటు తండావాసులు శుక్రవారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై సాయిబాబు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

జేఎల్‌ఎం సస్పెన్షన్‌..

జేఎల్‌ఎం విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్‌ రూరల్‌ డీఈ దానయ్య.. జేఎల్‌ఎం లకావత్‌ శేఖర్‌ను సస్పెండ్‌ చేశారు.

రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తిని ఢీకొన్న బైక్‌..

అక్కడికక్కడే మృతి.. మరొకరి పరిస్థితి విషమం

వర్ధన్నపేట: రోడ్డు పక్కన నిలబడి ఫోన్‌ మాట్లాడుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న బైక్‌ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫోన్‌ మాట్లాడుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఢీకొన్న వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని వరంగల్‌ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లికి చెందిన పొన్నం రాములు(42) బైక్‌పై శుక్రవారం రాత్రి ల్యాబర్తి గ్రామానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామం వస్తుండగా బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో రోడ్డు పక్కన నిలబడి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ల్యాబర్తి నుంచి వస్తున్న ఓ బైక్‌పై అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాములును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములును వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాములును ఢీ కొన్న వ్యక్తి కూడా అపస్మారక స్థితికి చేరగా అతడి వరంగల్‌ ఎంజీఎం తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు భార్యలు రజిత, కవిత, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement