● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ప్రభుత్వ శాఖలకు కేటాయించిన మొక్కల పెంపకం లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులోని అటవీశాఖ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్, డీఎఫ్‌ఓ విశాల్ బత్తుల, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు గురువారం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, జిల్లాలోని ప్రభుత్వశాఖలకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కల పెంపకం, సంరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ట్రీగార్డ్, రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. సమయానికి నీరు అందించాలని, అవెన్యూ ప్లాంటేషన్, మంకీ ఫుడ్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. ప్రతీ గ్రామపంచాయతీ, మున్సిపల్ పరిధిలో డిమాండ్‌కు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టి వెంటనే అందించాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా హార్టికల్చర్ అధికారి జినుగు మరియన్న, ఫారెస్ట్ రేంజ్ అధికారి సురేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కురవి రజిత, అంబాల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిథిలావస్థ భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. డీఐఈఓ మదార్ గౌడ్, కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డీపీ గణేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరుణ్ కుమార్, అధ్యాపకులు నయీమ్ పాషా, సురేందర్, షాహిద్, నాగిరెడ్డి, అప్పారావు, సుశీల, శివ, అయేషా, సారయ్య, బాలరాజు, రాజశేఖర్ పాల్గొన్నారు.


