విద్యుత్‌శాఖ ‘హైపర్‌ యాక్షన్‌ ప్లాన్‌’ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖ ‘హైపర్‌ యాక్షన్‌ ప్లాన్‌’

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

ఏఐ సాంకేతికతతో సమస్యల గుర్తింపు

ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి

నెహ్రూసెంటర్‌: వానాకాలం భారీ వర్షాలు, ఈదురుగాలుల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ వాతావరణ శాఖ ద్వారా సేకరిస్తూ మహబూబాబాద్‌ సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు ఎస్‌ఈ పి.విజేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్‌ సరఫరాలో జరిగే అంతరాయాన్ని అధిగమించేందుకు ‘హైపర్‌’ అనే ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని, వర్షాకాలం, ఈదురుగాలుల వల్ల విద్యుత్‌శాఖ ఎక్కువ ప్రభావితం అవుతుందని, వినియోగదారులకు తక్కువ సమయంలోనే విద్యుత్‌ పునరుద్ధరణ సేవలు అందించేందుకు ఈ హైపర్‌ ప్లాన్‌ దోహదం చేస్తుందన్నారు.

హైపర్‌ కార్యాచరణ..

● హెడ్‌ క్వార్టర్‌లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండడం

● అవసరమైన సిబ్బంది, సామగ్రిని ముందస్తు సమీకరించుకోవడం

● విద్యుత్‌ అంతరాయాలపై కచ్చితమైన సమాచార సేకరణ, వేగంగా చేరవేయడం

● నిర్ధిష్ట కార్యాచరణను వేగంగా అమలు చేయడం

● విద్యుత్‌ సరఫరాను నిర్దేశిత సమయంలో పునరుద్ధరించడం

● క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యూహం అమలు చేయడం

జీపీఆర్‌ఎస్‌ ఆధారిత ఎమర్జెన్సీ వాహనాలు..

భారీ వర్షాల వల్ల ఏర్పడే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రతీ సర్కిల్‌లోనూ ‘ఎమర్జెన్సీ రిస్టోర్‌ టీం’ వాహనాలను అందుబాటులో ఉంచామని ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ వాహనాల్లో వరమ్మతులకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్‌ ఉంటాయని, జీపీఆర్‌ఎస్‌ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా లోకేషన్‌ను వేగంగా గుర్తించి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంతో విద్యుత్‌శాఖ ముందు వరుసలో ఉందని, ఎస్‌సీఏడీఏ, జీఐఎస్‌, ఓఎంఎస్‌ వంటి డేటా వ్యవస్థలను ఏఐతో అనుసంధానం చేశామని తెలిపారు. లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా అందించేడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎస్‌ఈ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement