హన్మకొండ అర్బన్ : దేశవ్యాప్తంగా 200 ప్రధాన కేంద్రాల్లో ఒకేసారి ప్రాంతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వై.డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం హనుమకొండ దర్గా రోడ్డు లోని ఈపీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం వరంగల్ రీజినల్ కార్యాలయ పరిధిలో హనుమకొండ నక్కలగుట్ట అదాలత్ సర్కిల్ సమీపంలోని ఏకాశిల బ్యాంక్వెట్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్య శారద హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 50 మంది యజమానులు, 200 మంది ఉద్యోగులతో కలిపి మొత్తం 250 మంది లబ్ధిదారులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఉద్యోగ భవిష్యనిధి శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వై.డి శ్రీనివాస్


