పాపం.. పసికందు | - | Sakshi
Sakshi News home page

పాపం.. పసికందు

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

గర్భసంచికి సమస్య–

మళ్లీ ప్రెగ్నెన్సీకి చాన్స్‌ లేదు..

కాశిబుగ్గ : పాపం.. పసికందు. నెలలుగా తల్లిగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ శిశువు జన్మించిన కొంత సమయానికి కన్నుమూశాడు. కోటి ఆశలతో బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన కొద్ది క్షణాల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాదకర ఘటన వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కాగా, పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి సకాలంలో డెలివరీ చేయకపోవడంతో పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని, దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే బిడ్డ కన్నుమూసిన విషయం తల్లికి తెలియనీయలేదు. బిడ్డ లేదనే తెలిస్తే ఆమె ఆ‘వేదన’ భరించలేమంటూ దాచి పెట్టాల్సి వచ్చింది. చికిత్స కోసం బిడ్డను పెద్దాసుపత్రికి పంపించామంటూ చెప్పుతూ వస్తున్నారు. ఈ చేదు విషయాన్ని బాలింతైన తల్లికి ఎలా చెప్పాలో తెలియక ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డకు కడుపుకోత మిగిలిందని ఆరోపిస్తూ బోరున విలపించారు. అలాగే, సీకేఎం, ఎంజీఎం దవాఖానల్లో వెంటిలెటర్లు సకాలంలో అందక చిన్ని గుండె శ్వాస ఆడిపోయిందంటూ విలపించడం పలువురు హృదయాలను కలచివేసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన పెండ్లి కస్తూరి ఈ నెల 15న ఉదయం 8 గంటలకు డెలివరీ కోసం సీకేఎం ఆస్పత్రికి వస్తే ఉమ్మనీరు ఉందంటూ జాప్యం చేస్తూ వచ్చారు. ఇదేమిటని వైద్యులను అడిగితే మీ బిడ్డ కన్నా ఇంకా ఎమర్జెన్సీ పేషెంట్లు ఉన్నారంటూ దాట వేశారు. మా బిడ్డ కూడా ఎమర్జెన్సీ కదా అంటే మీ బిడ్డకు ఏమి కాదూ, ఏమన్నా అయితే బేబీకి అవుతుందని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు సమస్య ఉందని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. అయినా నాలుగైదు గంటలు వేచి చూసి అడిగితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మళ్లీ అడిగితే ‘ఓపిక ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి, మీరు వెళ్తే మాకు ఏమి ఫరక్‌ పడదు. ఇంతకుముందే సంతకాలు తీసుకున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో లేబర్‌ రూమ్‌కు తీసుకెళ్లి ఆపరేషన్‌ చేసిన తర్వాత 10.30 గంటల ప్రాంతంలో మగశిశువు జన్మించాడు. అయితే ఊపిరితిత్తుల సమస్య ఉందని, వెంటనే వెంటిలెటర్‌ మీద ఉంచాలంటూ చెప్పారు. సీకేఎంలో వెంటిలెటర్‌ లేదు.. ఎంజీఎం వెళ్లిండి అంటూ చెప్పడంతో అక్కడికి వెళ్లారు. ఎంజీఎం వైద్యులు చికిత్స చేస్తూ పుట్టిన బాబుకు నోటి నుంచి సరిగా పైపు వేయలేదంటూ సరిచేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం వెంటిలెటర్లు లేవంటూ చల్లగా వార్త చెప్పారు. దీంతో వారు పసిగుడ్డును తీసుకుని హుటాహుటినా అర్ధరాత్రి సమయంలో హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పతికి తరలించి చికిత్స చేయించారు. సీకేఎం, ఎంజీఎం సిబ్బంది సరిగా పైపు వేయలేదు, డెలివరీ సరిగా చేయలేదంటూ రోజు మొత్తం వెంటిలెటర్‌ మీద ఉంచాలంటూ చికిత్స అందించారు. ఇక్కడ చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసినా బుధవారం పుట్టిన బిడ్డ దక్కకుండా పోయాడు.

ఒకవైపు పుట్టిన పసిగుడ్డు దక్కకుండా పోయిందని దిగులతో ఉన్న కుటుంబ సభ్యులకు ‘మీ బిడ్డకు గర్భసంచి సమస్య ఉంది.. మళ్లీ ప్రెగ్నెన్సీకి అవకాశం లేదు’ అంటూ పిడుగు పడ్డట్లు మరో చేదు వార్త చెప్పారు. అలాగే, ఫ్యామిటీ ప్లానింగ్‌కు కుడా అవకాశం లేదని, ఆమె భర్తను చేయించుకోవాలంటూ సమాధానం ఇచ్చారు. తాము జాయిన్‌ చేసినప్పుడు ఎలాంటి సమస్య లేదని చెప్పి, ఇప్పుడు ఇలా చెబుతున్నారంటూ కుటుంబీకులు ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కేష్‌షీట్‌లో రాస్తామంటూ బదులిచ్చారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్షంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేయడంతో పాటు కంప్లైంట్‌ బాక్స్‌లో కూడా వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పురిటిలోనే కన్నుమూసిన బాలుడు.. తల్లికి తెలియని విషయం

బాలింత ఓ చోట.. బిడ్డ మరోచోట

కూతురికి ఎలా చెప్పాలో తెలియక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

సీకేఎంలో వైద్యుల నిర్లక్ష్యమే

కారణమని ఆరోపణ

ఉమ్మనీరు తక్కువగా ఉండడం..

సీకేఎంలో డెలివరీ కోసం అడ్మిట్‌ అయిన కస్తూరి పేషెంట్‌కు ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. అలాగే, ఆమెకు పూర్తిగా నెలలు నిండలేదు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదు. సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు విచారణ చేపడుతాం.

– నవీన్‌, ఆర్‌ఎంఓ, సీకేఎం ఆస్పత్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement