వరంగల్ క్రైం : తెలంగాణలో విద్య కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్‌లో 2024 జూలైలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీమ్ మత్తు పదార్థాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి అమ్మకాలు, పెంపకం, రవాణా, వినియోగం.. ఇలా ఏది కనిపించినా నిందితుల భరతం పడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం గంజాయి వినియోగించే వారిలో 90 శాతం మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను కాపాడడానికి డ్రగ్స్ కంట్రోల్ బృందాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్.. డ్రగ్స్ టీమ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
కేసులు 192.. నిందితులు 403 మంది
డ్రగ్స్ కంట్రోల్ టీమ్ కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయితోపాటు ఇతర మత్తు పదా ర్థాలు పట్టుకుంది. ఇప్పటి వరకు 192 కేసులు నమోదు చేసింది. ఇందులో అమ్మకాలతోపాటు వినియోగించిన వారు 403 మంది ఉన్నారు. వీరిపై ఆయా సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 1,241 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 7 గంజాయి మొక్కలు, 1.530 కిలోల ఓపీయం, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్, 251 గంజాయి చాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 8,57,90,978 ఉంటుంది. నిందితుల నుంచి రూ.2,15, 500 నగదు, 601 ఫోన్లు, 63 బైక్‌లు, 6 ఆటోలు, 8 కార్లు స్వాధీనం చేసుకుని నేరస్తులను జైలుకు పంపారు.
విముక్తికి చర్యలు..
యువతకు మత్తు నుంచి విముక్తి కల్పించడానికి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, నర్సంపేట, జనగామ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్యం అందించి కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిగా అలవాట్లు మానిన తర్వాత వారిని బయటకు పంపుతున్నారు. వ్యసనం నుంచి విముక్తి పొందిన యువతపై నమోదైన కేసులను సైతం తొలగిస్తున్నారు.
● కేసులు 192.. నిందితులు 403 మంది
● రూ.8.57 కోట్ల విలువైన సరుకు పట్టివేత
● 63 బైక్‌లు, 601 ఫోన్లు స్వాధీనం
డ్రగ్స్ నియంత్రణకు చర్యలు
కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మత్తు పదార్థాలపై ఎలాంటి సమాచారం ఉన్నా 87 123685299, 8712584473 నంబర్లకు సమాచారం అందించాలి. డ్రగ్స్ ఫ్రీ కమిషనరేట్‌కు ప్రజలు సహకరించాలి.
–సన్‌ప్రీత్‌సింగ్, సీపీ వరంగల్
2025 –2026లో కేసులు ఇలా
సంవత్సరం కేసులు నిందితులు స్మోకర్స్ స్వాధీనం చేసుకున్న వస్తువులు
2025 101 212 265 ఫోన్లు.. 205
4 కార్లు, 2 ఆటోలు
2026 44 108 55 ఫోన్లు.. 98, బైక్‌లు13,
2 ఆటోలు, 2 కార్లు


