హన్మకొండ: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు పోరాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాకేశ్ రెడ్డి ఇ–క్లాసెస్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాకేశ్ రెడ్డి ఇ–క్లాసెస్ యాప్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని దివాళకోరు ప్రభుత్వం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేని వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇ–క్లాసెస్ యాప్‌ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, బీఆర్‌ఎస్ విద్యార్థి విఽభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, కేయూ అర్థశాస్త్ర అధ్యాపకుడు తిరునహరి శేషు, ప్రముఖ న్యూరో వైద్యుడు నవీన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, చక్రవర్తి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి


