సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న అన్నదాతలు వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆకాశం వైపు చూస్తూ.. వానాకాలం పంటల సాగుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరిలో దీర్ఘకాలిక వంగడాల సాగుకు సమయం అయిపోయింది.. ఈ నెలాఖరులోపు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే స్వల్పకాలిక వరి వంగడాలు విత్తుకోవాలని, లేకుంటే వద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో రైతులు వర్షాలు కురుస్తాయా.. లేక ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేయాలా అనే మీమాంసలో పడ్డారు.
ముఖం చాటేసిన వర్షాలు..
మండుటెండ ఉండే రోహిణి కార్తెలో నార్లు పోసుకున్న ఘటనలు ఉన్నాయి. మృగశిర కార్తె కూడా పూ ర్తి కావొస్తుంది. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత తగ్గలేదు. గత ఏడా ది ఈ సమయానికి పలుమార్లు వర్షాలు కురిశాయి. ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నింపి నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పంటల సాగుకు రైతులు వెనుకాడలేదు. కానీ, ఇప్పుడు ఎస్సారెస్పీ జలాలు విడుదల కాలేదు. విడుదల చేసినా మొక్కుబడిగా వదిలారు. కాగా, ఈ నెల 14న జిల్లాలో మొత్తం 102.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే జిల్లా సగటున 6.6 మీ.మీ నమోదైంది. ఈనెల 16న జిల్లాలో 6.4 మిల్లీమీటర్లు కురిసింది. సగటున 0.4మిల్లీ మీటర్లు.. అంటే ఆకాశం నుంచి భూమిపై పడకముందే వర్షపు నీరు ఆవిరి అయినట్లే.
దుక్కులు దున్ని దిక్కులు..
వర్షాకాలం సాగు చేసి చెడాలి.. యాసంగి సాగు చేయకుండా చెడాలి అంటారు పెద్దలు. అందుకోసమే యాసంగి పంటల సాగు పూర్తి కాగానే.. ఉన్న కాస్త పదునుతో భూములను దున్నుకున్నారు. మరికొందరు దున్నిన భూమిలో పత్తి గింజలు కూడా నాటారు. ఇలా జిల్లాలో 20వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలో వేసి వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు మొలకెత్తుతాయని ధీమాతో ఉన్నారు. అయితే మృగశిరకార్తె కూడా పూర్తి కావస్తుండడంతో భూమిలో వేసిన విత్తనాలు వట్టిపోతాయేమో అని అన్నదాత ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకు జాడలేని వర్షాలు..
దీర్ఘకాలిక వరి వంగడాలకు అవకాశం లేనట్టే
ఈనెల గడిస్తే స్వల్పకాలిక వంగడాలు కూడా వద్దంటున్న శాస్త్రవేత్తలు
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయ అధికారులు
ఆరుతడి, పునాస పంటలే దిక్కంటున్న రైతులు
పంటలమార్పు కోసం చూపు..
ప్రస్తుత పరిస్థితులు, యూరియా కొరత, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో సమస్యల నేపథ్యంలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు అని శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు అటువైపుగా చూస్తున్నారు. ఇప్పటికే 150రోజుల పంట కాలం ఉండే సిద్ది, బీపీటీ రకాలు వేసినా ప్రయోజనం ఉండదు. 130 రోజుల పంటకాలం ఉన్న 16–38, కునారం వంటి వంగడాల సాగుకు మరికొద్దిరోజులే సమయం ఉంది. 120 రోజుల కాలవ్యవధిలో చేతికొచ్చే పంట రకాలు ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ, వరంగల్ 962 రకాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది కూడా వేయలేకపోతే.. తక్కువ నీటి తడులతో పండే ఆరుతడి పంటలు జొన్న, శనగ, పెసర, బొబ్బెర, కూరగాయల సాగు చేయాలని బోర్లు, బావుల కింద ఉన్న రైతులు ఆలోచిస్తున్నారు. కాగా, వర్షాధార పంటలు సాగుచేసే కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరు, కేసముద్రం ప్రాంతాల రైతులు వలసలు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.


