జిల్లాలో పాఠశాలల వివరాలు
ప్రభుత్వ పాఠశాలలు 738
మోడల్ స్కూల్ 08
కేజీబీవీలు 16
గిరిజన ఆశ్రమ పాఠశాలలు 23
మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాలు 06
మైనార్టీ గురుకులాలు 05
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు 08
సాంఘిక సంక్షేమ గురుకులాలు 05
ప్రైవేట్ పాఠశాలలు 121
ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్ 77
మహబూబాబాద్ అర్బన్: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. సోమవారం బడి గంట మోగనుండగా పుస్తకాలతో కుస్తీపట్టనున్నారు. దీంతో విద్యాలయాలు సందడిగా మారనున్నాయి. ప్రతీ విద్యాసంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పాఠశాలల్లో సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి.
పూర్తిస్థాయిలో చేరుకోని పుస్తకాలు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3,07,850 పుస్తకాలు రావాల్సి ఉండగా 1,00,090 మాత్రమే వచ్చాయి. కాగా, సరఫరా అయిన పుస్తకాలను గురుకులాలకు అందజేశారు. అలాగే జిల్లాకు స్కూల్ యూనిఫామ్ రాలేదు. జిల్లాలో మొత్తం 738 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా గత సంవత్సరంలో 40,703 మంది విద్యార్థులు నమోదు అయ్యారు. ప్రతీ విద్యాసంవత్సరం జూన్ నెలలో బడిబాట నిర్వహిస్తారు. విద్యాశాఖ ఆశించిన స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం మే 14 నుంచి బడిబాట నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,690 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు.
సమస్యలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఆందోళన కలిగిస్తోంది. అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 3,491మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సరైన సబ్జెక్ట్‌ల టీచర్ల లేకపోవడంతో విద్యార్థులు విద్యాపరంగా నష్టపోవాల్సివస్తోంది. గతేడాది చాలాచోట్ల ప్రహరీలు, తాగునీరు, అదనపు గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలోనే ఐదో ర్యాంకు..
2025–26 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో మానుకోట రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచింది. చాలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. 8,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,055మంది ఉత్తీర్ణత సాధించారు. 85 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
ప్రశ్నార్థకంగా పర్యవేక్షణ..
జిల్లాలోని విద్యాధికారుల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. కాగా, 18 మండలాలకు సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంఈఓగా నియమించారు. ప్రధానోపాధ్యాయులు ఇటు పాఠశాల అటు ఎంఈఓ కార్యాలయ పనులతో సతమతమవుతున్నారు. దీంతో పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. ఎంఈఓలు అదనపు భారంతో సరైన న్యాయం చేయలేకపోతున్నారు.
ఐదేళ్లలో ప్రైవేట్‌లో నమోదు ౖపైపెకి..
గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ గురుకుల పాఠశాలల్లో పెరిగింది. కాగా, తమ పిల్లలు భద్రంగా ఉంటూ ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్‌తో పాటు గురుకులాల్లో జాయిన్ చేస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
జిల్లాకు చేరిన 1,00,090 పుస్తకాలు
బడిబాటలో 3,690 మంది
విద్యార్థుల అడ్మిషన్లు
అడ్రస్ లేని స్కూల్ యూనిఫామ్
ఎక్కడి సమస్యలు అక్కడే..
ఐదేళ్లలో ప్రైవేట్ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు
గురుకులాలకు సైతం ఆదరణ


