వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం అమావాస్య కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

పాఠశాలల తనిఖీ

కొత్తగూడ: మండలంలోని పలు పాఠశాలలను ఆదివారం డీఈఓ సత్యనారాయణమూర్తి తనిఖీ చేశారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు వచ్చాయా అని ఎంఈఓ గుమ్మడి లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. మండల కేంద్రంలో దివ్యాంగుల కోసం నిర్మించిన భవిత కేంద్రాన్ని పరిశీలించారు. వేలుబెల్లి ప్రాథమికోన్నత పాఠశాల గదులు, మరుగుదొడ్లు, వంట గదిని తనిఖీ చేశారు. ఆయన వెంట కమ్యూనిటీ మొబిలైజర్‌ సురేష్‌, వేలుబెల్లి సర్పంచ్‌ అక్షయ్‌వర్మ ఉన్నారు.

తాటి, ఈత చెట్లు దగ్ధం

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామంలో 30 తాటి చెట్లు, 60 ఈత చెట్లు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు వ్యాప్తిచెంది తాటి, ఈత చెట్లు ఉన్న ప్రాంతానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధిత గౌడ కులస్తులు ప్రమాదంపై విచారణ జరిపి నష్టపరిహారం అందించాలని కోరారు.

హేమాచల క్షేత్రంలో

భక్తుల సందడి

మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్‌శర్మ, ఈశ్వర్‌చంద్‌ శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement