సంగెం: దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ బోల్తాపడి రైతు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన రైతు అల్లం అనిల్ (35) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ అప్పుడప్పుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం గ్రామానికి చెందిన ఒడిదేని మహేశ్‌కు చెందిన ట్రాక్టర్ రోటోవేటర్‌తో అనిల్ తన వ్యవసాయ భూమిలో దుక్కిదున్నుతున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ అదుపు తప్పి కిందపడిపోయింది. రోటోవేటర్‌లో చిక్కుకుని తీవ్రంగా గాయపడి అనిల్ అక్కకడిక్కడే మృతి చెందాడు. అనంతరం ట్రాక్టర్ రోటోవేటర్‌తో సహా ముందుకు వెళ్లి అక్కడ ఉన్న దేవాదుల ఎత్తిపోతల ఉపకాల్వలో బోల్తా పడింది. అనిల్‌కు భార్య సుప్రియ, కుమారుడు అశ్విన్, కూతురు కనిష్క ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అనిల్ తల్లిదండ్రులు, భార్య సుప్రియ, పదేళ్లలోపు ఉన్న పిల్లలు రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలచివేసింది. అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
తీవ్రగాయాలతో రైతు మృతి


