భువనగిరిటౌన్ : జాతీయ రహదారి మరమ్మతుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ డైవర్షన్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రాఫిక్ కారణంగా సడన్ బ్రేక్ వేసిన టిప్పర్‌ను బైక్‌పై వెళ్తున్న యువకుడు వెనుక నుంచి ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి బైపాస్ రోడ్డులోని టీచర్స్ కాలనీ సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో అధికారులు వన్ వే ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఆ మార్గంలో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వస్తున్న టిప్పర్ డ్రైవర్ ట్రాఫిక్ కారణంగా సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో బైక్‌పై వస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లగూడెం గ్రామానికి చెందిన నూకల రాహుల్ (21) వెనుక నుంచి టిప్పర్‌ను ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
పరీక్షలు పూర్తి..
అంతలోనే..
రాహుల్ సొంతూరు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి కాగా.. అతడి కుటుంబం పదేళ్ల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లగూడెం వలస వచ్చింది. రాహుల్ తల్లిదండ్రులు ఏదుళ్లగూడెంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. రాహుల్ భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీజెడ్‌సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు పూర్తికావడంతో వేసవి సెలవుల్లో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఔషాపూర్‌లో ఉంటున్న తన బావ ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అక్కడ నుంచి బైక్‌పై ఏదుళ్లగూడేనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. ట్రాఫిక్ డైవర్షన్ చేసిన ప్రాంతంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రాహుల్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, మిత్రులు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం.రమేశ్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్ మృతదేహాన్ని సొంతూరైన ఉప్పరపల్లికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
మరమ్మతుల నేపథ్యంలో వరంగల్–హైదరాబాద్ హైవేపై భువనగిరి పట్టణంలో వన్ వే ఏర్పాటు
ట్రాఫిక్ కారణంగా సడన్ బ్రేక్ వేసిన టిప్పర్ డ్రైవర్
బైక్‌పై వస్తూ వెనుక నుంచి ఢీకొని యువకుడి మృతి


