● కేసుల పాలు కావడంతో పాటు లాఠీ దెబ్బలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ డోలి సత్యనారాయణకు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో ఉద్యమకారులంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన పేరే. ఉద్యమకాలంలో అనేక కేసుల పాలు కావడంతో పాటు లాఠీ దెబ్బలు తిన్నారు. ఆర్థికంగా, అన్ని రకాలుగా నష్టపోయారు.
జేఏసీ కన్వీనర్‌గా..
ఉద్యమ కాలంలో జేఏసీ కన్వీనర్‌గా డోలి సత్యనారాయణ పని చేశారు. పలు కార్యక్రమాల ద్వారా ఉద్యమ ఆవశ్యకతను తెలియజేశారు. కన్వీనర్‌గా అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. రైల్‌రోకోలు, వంటావార్పులు, ధర్నాలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తన వంతు కృషి చేశారు. ఉద్యమాలకు తన విద్యాసంస్థనే కేరాఫ్‌గా చేసుకుని ముందుకు సాగారు. ఫరీద్, శంతన్‌రామరాజు, పిల్లి సుధాకర్‌తోపాటు చాలా మంది ఉద్యమకారులతో పాటు పలు పార్టీల నాయకులతో కలిసి కార్యక్రమాలు చేశారు. అమరవీరుల స్తూపాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తింపు కల్పించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారులకు 250గజాల స్థలం ఇవ్వాలి. పింఛన్, హెల్త్ కార్డులు ఇవ్వాలి. కేకే కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పూర్వ జేఏసీ ఉద్యమకారులను గుర్తించాలి.
– డోలి సత్యనారాయణ, ఉద్యమకారుడు


