నాపై వందకుపైగా కేసులు | - | Sakshi
Sakshi News home page

నాపై వందకుపైగా కేసులు

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

ఉద్యమకారుడు బానోత్‌ రవికుమార్‌

జిల్లాలోని గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన బానోత్‌ రవికుమార్‌ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తనపై వందకు పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా, ఆయన టీఆర్‌ఎస్వీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా, విద్యార్థిజేఏసీ మానుకోట డివిజన్‌ చైర్మన్‌గా పని చేశారు. మానుకోట, డోర్నకల్‌, ములుగు, నర్సంపేట నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాల్లో 400 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు.

కేసులతో జైలుకు..

బానోత్‌ రవికుమార్‌పై 100కు పైగా కేసుల్లో 30నాన్‌ బెయిలబుల్‌ కేసులతో జైలుకు వెళ్లాడు. 2008 అక్టోబర్‌ 4వ తేదీన ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ప్రజాచైతన్యం పేరుతో యాత్ర చేపట్టారు. కాగా, నర్సంపేటలో జరిగిన సభలో చిరంజీవిపై బానోత్‌ రవికుమార్‌ కోడిగుడ్లు వేసి నిరసన తెలిపారు. దీంతో రవికుమార్‌ కేసీఆర్‌ దృష్టిలో పడ్డారు. ఆకేసులో నర్సంపేట జైలులో వారం రోజు లు, వరంగల్‌ సెంట్రల్‌ జైలులో నెలరోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. రైల్వే కేసులో కూడా నెలరోజులపాటు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చాలా కేసుల్లో మానుకోట సబ్‌ జైలులో ఉన్నారు.

ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. పెన్షన్‌ రూ.50,000, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. ఉచిత బస్సు, రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

– బానోత్‌ రవికుమార్‌, ఉద్యమకారుడు

Advertisement
 
Advertisement
Advertisement