నిధుల లేమితో నిలిచిన పలు అభివృద్ధి పనులు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతోండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు. కొన్ని పనులు నిధుల కొరతతో.. మరికొన్ని పనులు నిధులున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పూర్తి కావడంలేదు. మానుకోట మున్సిపల్ పరిధిలో 36 వార్డులు 65,712 మంది ఓటర్లు ఉండగా విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి లక్ష జనాభా దాటుతుంది.
ఏళ్ల గడుస్తున్నా పూర్తి కాని రోడ్డు
జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ సమీపం నుంచి కిలోమీటర్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడుస్తున్నా యి. కేవలం డివైడర్లు, డ్రెయినేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు మాత్రమే పూర్తి చేశారు. పనులు జరగకపోవడంతో ఈదులపూసపల్లి గ్రామంతోపాటు కేసముద్రం వెళ్లే వారు ఆ మార్గంలో ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసంపూర్తి రోడ్డుతో తరచూ ప్రమాదాలకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. ఆ రోడ్డుకు రూ.5 కో ట్లు కేటాయించగా రూ.3 కోట్లు విడుదలైనా కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు పూర్తి కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నెహ్రూసెంటర్ నుంచి మంగళ కాలనీ వరకు 1.2 కిలోమీటర్ల రోడ్డులో 900 మీటర్లు పూర్తి చేశారు. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయి. కానీ, డ్రెయినేజీ పనులు మిగతా రోడ్డు పనులు పూర్తి చేయలేదు. సుమారు 5 సంవత్సరాలు దాటుతున్నా నేటికీ పనులు కొనసాగుతోండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. దాంతో ఆ రోడ్డు గుండా వెళ్లే పలు కాలనీవాసులతోపాటు రాజాలిపేట, మల్యాలతోపాటు పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వినియోగంలోకి రాని మోడల్ మార్కెట్
జిల్లా కేంద్రంలో రూ.4.50 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మించారు. నిధులు విడుదల కాకపోవడంతో మున్సిపాలిటీ నిధులతోనే పనులు పూర్తి చేయించారు. గత ప్రభుత్వంలో నాటి మంత్రి కే.తారక రామారావు మార్కెట్‌ను ప్రారంభించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మురళీనాయక్ రూ.90 లక్షలు కేటాయించి మిగిలిన పనులు పూర్తి చేయించి, మళ్లీ ప్రారంభించారు. ప్రారంభించి నెలలు గడుస్తున్నా నేటికీ వినియోగంలోకి రాలేదు. కూరగాయలు విక్రయించే వారికి కేటాయించి వాటికి యూజర్ చార్జీలు ఒక్కో గదికి రూ.2,500గా నిర్ణయించగా.. పలువురు కౌన్సిలర్లు రూ.1,000 కేటాయించాలని కోరారు. దాంతో పెండింగ్‌లోనే ఉంది. ఇదిలా ఉండగా.. మున్సిపల్ వార్డుల్లోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినా వాటిని మరో కాల్వకు కలపలేదు. దాంతో అసంపూర్తిగా ఉన్నాయి.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు
వినియోగంలోకి రాని మోడల్ మార్కెట్
మున్సిపల్ భవనానికి నిధుల కొరత
జిల్లా కేంద్రం శివారులో అనంతారం రోడ్డులో రెండు ఎకరాల స్థలంలో మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి 2018 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరిగింది. కానీ, నేటికీ పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు మారినా పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. ఆ భవనానికి రూ.4.5 కోట్లు కేయించారు. జీప్లస్ భవనం పనులు చేపట్టి 75 శాతం పూర్తి చేశారు. ఇంత వరకు ఒక్క బిల్లు కూడా రాలేదు. దాంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. కేవలం నిధులు విడుదల కాలేదని పనులు పూర్తి చేయడం లేదు. ప్రస్తుతం ఇరుకైన గదుల్లో అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 36 మంది కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించడానికి ఇబ్బంది అవుతుండడంతో ఫంక్షన్ హాల్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.


