ప్రాణరక్షణకు హెల్మెట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ప్రాణరక్షణకు హెల్మెట్‌ తప్పనిసరి

Apr 16 2026 10:36 AM | Updated on Apr 16 2026 10:36 AM

మహబూబాబాద్‌ రూరల్‌: హెల్మెట్‌ ఒక్కటే ప్రాణాలను రక్షించే ప్రధాన భద్రతా సాధనమని ఎస్పీ శబరీష్‌ పేర్కొన్నారు. అరైవ్‌.. అలైవ్‌ –2026 కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి రోడ్డు భద్రతపై బుధవారం హెల్మెట్‌ అవగాహన, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తమ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్‌ మాట్లాడుతూ పిల్లల భద్రత తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత అని అన్నారు. చిన్నదూరం ప్రయాణమైనా హెల్మెట్‌ వినియోగించాలని సూచించారు. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని, ప్రతీ ఒక్కరూ తమ పిల్లలకు కూడా హెల్మెట్‌ వాడాలన్నారు. హెల్మెట్‌ సరైన విధంగా బిగించి పెట్టకపోతే ఉపయోగం ఉండదని, సరిగ్గా ధరించడం కూడా ముఖ్యమని వివరించారు. సమాజం మొత్తం ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు హెల్మెట్‌ ధరించమని గుర్తు చేయడం ద్వారా మంచి మార్పు తీసుకురాగలరని, రోడ్డు భద్రత కుటుంబ స్థాయి నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేగ పరిమితులు పాటించడం, ట్రిపుల్‌ రైడింగ్‌ నివారించడం, ట్రాఫిక్‌ నియమాలను గౌరవించడం వంటి అంశాలు కూడా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని వివరించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని గుర్తుంచుకుని, హెల్మెట్‌ వినియోగాన్ని ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్పీ శబరీష్‌

Advertisement
 
Advertisement
Advertisement